ఆర్మూర్, డిసెంబరు 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామ శివారులో గల పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి సోదరుడు రాజేశ్వర్ రెడ్డి నివాసంలో ఆదివారం రాత్రి శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజ వైభవోపేతంగా జరిగింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన అయ్యప్ప స్వామి భక్తుల శరణు ఘోషతో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సోదరుడి నివాసం శబరిమల వైభవం సంతరించుకుంది.
అయ్యప్పస్వామి పూజోత్సవంలో భక్తులు పరవశించారు. అయ్యప్ప స్వామి మహాపడి పూజోత్సవంలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్వామి వారికి పడి పూజను నిర్వహించారు. నియోజకవర్గ నలుమూల నుండి వందలాది గా తరలి వచ్చిన స్వాములు స్వామియే శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప అంటూ ఆలపించిన కీర్తనలతో రాజేశ్వర్ రెడ్డి నివాస పరిసరాలు భక్తి పారవశ్యంలో మునిగిపోయాయి.
జీవన్‌రెడ్డి స్వయంగా కుటుంబ సభ్యులతో కలిసి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి పంచామృతాభిషేకం, పుష్పాభిషేకం, చక్రస్నానం, జలాభిషేకంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి ప్రత్యేక పూలతో పుష్పాభిషేకం నిర్వహించి హారతి ఇచ్చారు. అనంతరం జీవన్ రెడ్డి దంపతులు స్వాములకు అల్పాహార ప్రసాదాలను వడ్డించారు.
మహా పడి సన్నిధానాలు, గురుస్వాములు, రుత్విజుల వేద మంత్రోచ్ఛరణలు, శరణుఘోషతో అత్యంత వైభవంగా మహాపడిపూజ సాగింది. ఈ కార్యక్రమం లో ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు, బీ.ఆర్.ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈసందర్భంగా జీవన్ రెడ్డి భక్తులతో మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఎక్కడో ఉండరని, మాలాధారణ చేసిన ప్రతి వ్యక్తిలోనూ ఉంటారని అన్నారు.
అయ్యప్ప దీక్ష చాలా గొప్పదని, కులమత, ప్రాంత, వర్ణ, వర్గాలకు అతీతంగా ప్రతిఒక్కరూ మాలధరిస్తారని, అయ్యప్ప వారిలోనే కొలువై ఉంటారని ఆయన తెలిపారు ప్రతీ ఒక్కరు వారి వారి ఆచారాలకు తగిన విధంగా దైవ చింతన ను కలిగి ఉండాలని, అలా చేయడం వల్ల మనసు అదుపులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మనసు అదుపులో ఉంటే చెడు వైపు మన దృష్టి వెల్లదన్నారు. రాష్ట్ర ప్రజలు ప్రతీ ఒక్కరు అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నాని జీవన్ రెడ్డి వెల్లడిరచారు.