కామారెడ్డి, డిసెంబరు 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పారదర్శికమైన తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రధాని ఎన్నికల అధికారి వికాస్ రాజు అన్నారు. బుధవారం వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. 18 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరికి ఓటర్ జాబితాలో చోటు కల్పించాలని సూచించారు. ప్రత్యేక ఓటర్ల నమోదు ద్వారా స్వీకరించిన దరఖాస్తులను ఓటర్ జాబితాలో తక్షణమే నమోదు చేయాలని కోరారు.
ఓటర్ జాబితాలో కొందరి పేర్లు రెండుసార్లు ఉంటే వాటిని పరిశీలించి, ఒకటి తొలగించాలని పేర్కొన్నారు. మృతి చెందిన వారి పేర్లు ఉంటే తొలగించాలని సూచించారు. ఓటర్ల జాబితాను రూపొందించడంలో అధికారులు పూర్తిగా స్వేచ్ఛగా, నిజాయితీగా, పారదర్శికంగా వ్యవహరించి వాస్తవ పరిస్థితులు ఆధారంగా న్యాయమైన తుది జాబితాను రూపొందించాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు.
ప్రత్యేక ఓటర్ నమోదు లో వచ్చిన దరఖాస్తుల పరిష్కార ప్రగతి వివరాలు తెలిపారు. డిసెంబర్ 26 ఓటర్ జాబితాలోని అభ్యంతరాలను తొలగించి జనవరి 3న తుది ముద్రణకు పంపి జనవరి 5న తుది జాబితాను రూపొందిస్తామని చెప్పారు.
ఎన్నికల విధుల్లో జిల్లా ఎన్నికల ఆదేశాలను అధికారులు తప్పక పాటించే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, కామారెడ్డి ఆర్‌డిఓ శ్రీనివాస్ రెడ్డి, ఎన్నికల పర్యవేక్షకుడు సాయి భుజంగరావు, అధికారులు పాల్గొన్నారు.