నిజామాబాద్, డిసెంబరు 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను ఈ నెల 26 వ తేదీ నాటికి పరిశీలన ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సూచించారు. బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 8 వ తేదీ వరకు స్వీకరించిన దరఖాస్తులకు సంబంధించి ఆన్‌లైన్లో డేటా ఎంట్రీ పూర్తి చేసిన నేపథ్యంలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా క్షుణ్ణంగా స్క్రూటినీ జరపాలన్నారు. వచ్చే నెల జనవరి 5 న ఓటర్ల తుది జాబితాను ప్రకటించాల్సి ఉన్నందున, పరిశీలన ప్రక్రియలో జాప్యానికి తావు లేకుండా వెంటదివెంట పూర్తి చేయాలని అన్నారు.
ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు రోజువారీగా దరఖాస్తుల పరిశీలన ప్రగతిని సమీక్షించాలని సూచించారు. డూప్లికేషన్ ఓట్లు లేకుండా పక్కాగా ఓటరు జాబితా రూపొందేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఒకే వ్యక్తికి వేర్వేరు ప్రాంతాల్లోని ఓటరు జాబితాలో పేరు ఉండకుండా ఇంటింటికి తిరిగి క్షుణ్ణంగా నిర్ధారణ చేసుకోవాలని హితవు పలికారు. ఈ మేరకు చెక్ లిస్టును రూపొందించుకుని బీ.ఎల్.ఓ లచే క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపించాలన్నారు.
జనాభా లెక్కల ప్రకారం18 సంవత్సరాలకు పైబడిన వారి సంఖ్య కంటే ఓటర్ల నిష్పత్తిలో గణనీయమైన తగ్గుదల ఉంటే అందుకు గల కారణాలను అన్వేషించాలని సూచించారు. 2023 లో ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా చూడాలన్నారు. ఓటరు జాబితాలో స్త్రీ, పురుష నిష్పత్తితో పాటు దివ్యంగులు, ట్రాన్స్ జెండర్ల వివరాలను ప్రత్యేకంగా సేకరించి నమోదు చేయాలన్నారు.
దివ్యంగులైన ఓటర్ల వివరాలను సదరం జాబితా, పెన్షన్ల పంపిణీ జాబితా ఆధారంగా గుర్తించవచ్చని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 సంవత్సరాల వయస్సు పూర్తి చేసుకున్న ఓటర్ల సంఖ్య 6149 ఉందని, క్షేత్రస్థాయిలో ఆ వివరాలను మరోసారి సమగ్రంగా ధృవీకరించుకోవాలని ప్రధాన ఎన్నికల అధికారి సూచించారు. జాబితాలో పుట్టిన తేదీ వివరాలు తప్పుగా ఉంటే వాటిని సవరించాలన్నారు.
అదేవిధంగా ఓటర్ల ఫొటోలు సరైనవిధంగా లేనట్లయితే, వాటిని సరిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఓటరు జాబితా పారదర్శకంగా, పక్కాగా రూపొందబడేలా అన్ని స్థాయిలలో పకడ్బందీ పరిశీలన చేయాలని, ఎన్నికల సంఘం నియమ నిబంధనలు తూ.చ తప్పకుండా అమలయ్యేలా చూడాలన్నారు.
వీడియో కాన్ఫరెన్సులో రాష్ట్ర సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి టి.రవికిరణ్, కలెక్టర్ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, జెడ్పి సీఈఓ గోవింద్, బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం అధికారులు పవన్, సాత్విక్, ఆయా నియోజకవర్గ కేంద్రాల తహసీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.