నిజామాబాద్, డిసెంబరు 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా చేపడుతున్న అభివృద్ధి పనులను నిర్ణీత గడువు లోపు పూర్తి చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. నగరంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను కలెక్టర్ గురువారం క్షేత్రస్థాయిలో సందర్శించారు.
ఖలీల్వాడిలో నూతనంగా నిర్మించతలపెట్టిన వెజ్-నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ స్థలాన్ని, అహ్మదీ బజార్ వద్ద ఖిల్లా రోడ్డును ఆనుకుని అధునాతన సదుపాయాలతో నిర్మించిన సమీకృత మార్కెట్ సముదాయ భవనాన్ని, అర్సపల్లి, ఖిల్లా, కోటగల్లి ప్రాంతాల్లో కొనసాగుతున్న వైకుంఠధామాల నిర్మాణాలను పరిశీలించి, పనుల ప్రగతి గురించి సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఖిల్లా వైకుంఠధామం పనులు మందకొడిగా సాగుతుండడాన్ని గమనించిన కలెక్టర్, అధికారులను, కాంట్రాక్టు ఏజెన్సీ ప్రతినిధిని మందలించారు.
తాపీగా పనులు జరిపిస్తే ఎప్పటిలోగా పూర్తి చేయగలుగుతారని నిలదీశారు. నిధులు వెంటదివెంట అందిస్తున్నందున జాప్యానికి తావులేకుండా గడువు లోపు పనులను పూర్తి చేయించాలని ఆదేశించారు. వచ్చే మే నెల నాటికి ఖిల్లా వైకుంఠధామం అన్ని వసతులతో అందుబాటులోకి వచ్చేలా ప్రణాళికాబద్ధంగా పనులు జరిపించాలన్నారు. వారం రోజుల్లో మళ్లీ తాను పరిశీలనకు వస్తానని, పనుల్లో పురోగతి కనిపించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
తుది దశకు చేరిన అహ్మదీబజార్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సముదాయాన్ని సైతం జనవరి 15వ తేదీ లోపు ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని స్పష్టమైన గడువు విధించారు. వేగవంతంగా పనులు చేపట్టేందుకు ఇది ఎంతో అనుకూలమైన సమయం అయినందున విరామం లేకుండా మూడు షిఫ్టులలోనూ పనులు జరిపించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగింపు ఉండదని, నిర్ణీత సమయంలోగా నిర్మాణాలన్ని పూర్తి కావాల్సిందేనని తేల్చి చెప్పారు.
ఆయా విభాగాల పనులను ఏకకాలంలో కొనసాగేలా నిరంతరం పర్యవేక్షణ జరపాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సకాలంలో పనులు పూర్తి చేసినప్పుడే జిల్లా యంత్రాంగానికి, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. కలెక్టర్ వెంట వివిధ శాఖల అధికారులు ఉన్నారు.