కామారెడ్డి, డిసెంబరు 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బృహత్ పల్లె ప్రకృతి వనాల పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. నిజాంసాగర్ తాసిల్దార్ కార్యాలయం నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులతో పల్లె ప్రగతి పనులపై సమీక్ష నిర్వహించారు. అసంపూర్తిగా ఉన్న బృహత్ పల్లె ప్రకృతి వనాలను పూర్తి చేయాలని సూచించారు.
గ్రామాల్లో ఉన్న నర్సరీలను ఎంపీడీవోలు పర్యవేక్షణ చేయాలని కోరారు. అన్ని గ్రామాల్లో క్రీడ ప్రాంగణాలను పూర్తి చేయాలని సూచించారు. ఉపాధి హామీ పథకానికి అధిక మంది కూలీలు హాజరయ్యే విధంగా చూడాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఫాంపౌండ్, ఫిష్ పాండ్‌ను నిర్మించుకునే విధంగా అధికారులు గ్రామాల్లో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే మాట్లాడారు. ప్రతి శుక్రవారం (వాటరింగ్ డే) మొక్కలకు నీరు పోసే కార్యక్రమాన్ని విధిగా చేపట్టాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డిఆర్డిఓ సాయన్న, డిపిఓ శ్రీనివాసరావు, డిఎల్పిఓలు సాయిబాబా, శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.