నిజామాబాద్, డిసెంబరు 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పాత జిల్లా కలెక్టర్ కార్యాలయ భవనాల సముదాయము, క్రీడ మైదానము, ఇతర ప్రభుత్వ స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు అప్పగించోద్దని డిమాండ్ చేస్తూ సీపీఐ (ఎం.ఎల్) ప్రజాపంథా నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా క్రీడా మైదానంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
సమావేశానికి సీపీఐ (ఎం.ఎల్) ప్రజాపంథా నగర కార్యదర్శి ఎం.సుధాకర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చిన వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం, జిల్లాలోని అధికార పార్టీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా మారి ప్రభుత్వ స్థలాలతో వ్యాపారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రానికి గుండెకాయ లాంటి జిల్లా కలెక్టర్ కార్యాలయ భవన సముదాయము, కలెక్టర్ క్యాంప్ కార్యాలయం, సీపీ క్యాంప్ కార్యాలయం, జిల్లా క్రీడా మైదానం, పోలీసు పరేడ్ గ్రౌండ్, ఇరిగేషన్ తదితర ప్రభుత్వ శాఖలకు చెందిన 20 ఎకరాలకు పైగా గల స్థలంపై అధికార పార్టీ నేతల కళ్ళు పడ్డాయన్నారు.
ఈ స్థలాలను దిల్ రాజు, యశోద హాస్పిటల్స్, రిలయన్స్ కంపెనీలకు లీజు పేరిట దారాదత్తం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఈ కుట్రలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రైవేటు కంపెనీలకు ప్రభుత్వ స్థలాలను అప్పగించే కుట్రలను మానుకోవాలని హెచ్చరించారు. క్రీడా మైదానము, కలెక్టర్ కార్యాలయం ఇతర ప్రభుత్వ శాఖల స్థలాలు ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించాలని, భవిష్యత్తు అవసరాలకు ప్రజలకు ఉపయోగపడే విధంగా వినియోగించాలని డిమాండ్ చేశారు.
ఈ స్థలాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించే కుట్రలు చేస్తే ప్రజలందరిని సమీకరించి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామన్నారు. ఈ స్థలాలను ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగిస్తామని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించే వరకు ఆందోళన కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. ప్రభుత్వ స్థలాలను ప్రైవేటీకరించే కుట్రలను ఐక్యకారచరణతో ప్రతిఘటిస్తామన్నారు.
రౌండ్ టేబుల్ సమావేశంలో సీపీఐ (ఎం.ఎల్) ప్రజాపంథా జిల్లా కార్యదర్శి (ఇన్చార్జి) వనమాల కృష్ణ, కాంగ్రెస్ పిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు తాహెర్ బిన్ హందాన్, ఒలంపిక్ సంఘం జిల్లా కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, సీపీఎం, సీపీఐ, టిడిపి మరియు వివిధ ప్రజా సంఘాల నాయకులు డాక్టర్ కేశవులు, వి.ప్రభాకర్, కే.రామ్మోహన్ రావు, భాస్కర్, ఆల్గోట్ రవీందర్, దండి వెంకట్, ఎం.నరేందర్, రెంజర్ల సురేష్, ఎం.వెంకన్న, పెద్ది సూరి, రంజిత్, ప్రమోద్ కుమార్, సంధ్యారాణి, కర్క గణేష్, సాయగౌడ్, బాలరాజు, శివరాజు, రాజేశ్వర్, గంగాధర్, భాస్కర్ రెడ్డి, సురేష్, కిరణ్, జహీర్ తదితరులు పాల్గొని మాట్లాడారు.