ఎడపల్లి, డిసెంబరు 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్ధిక ఇబ్బందులు తాళలేక ఓ కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. ఈ ఘటనలో భర్త మృతి చెందగా భార్య ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టు మిట్టాడుతుంది. పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విషాద సంఘటన బుధవారం రాత్రి గ్రామంలో చోటుచేసుకోగా గురువారం ఉదయం వెలుగు చూసింది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జాన్కంపేట్ గ్రామానికి చెందిన ఒఢె సాయిలు (40), రేఖ ఇద్దరు భార్యాభర్తలు, వీరికి అరుణ్, రాంచరణ్ అనే ఇద్దరు కుమారులు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి, 7వ తరగతి చదువుతున్నారు. బతుకు దెరువు కోసం సాయిలు సుమారు 12 సంవత్సరాలు దుబాయ్‌లో ఉండి గత రెండు సంవత్సరాల క్రితం దుబాయ్ నుంచి తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో సాయిలు స్థానిక స్టోన్ క్రషర్ మిషన్ లో కూలీగా పనిచేస్తున్నాడు.
బుధవారం సాయంత్రం క్రషర్ మిషన్ వద్ద నుంచి పని ముగించుకొని వచ్చిన సాయిలు, భార్య పిల్లలతో కలసి వెంట తెచ్చుకొన్న పురుగుల మందును సేవించారు. అనంతరం సాయిలు బయటకు వెళ్ళగా అక్కడిక్కడే పడిపోయాడు. దీంతో ఇది గమనించిన స్థానికులు ఇంటికి తీసుకెల్లగా ఇంట్లో సైతం అదే దృశ్యం కనబడగా వెంటనే స్థానికులు ఆటోలో వారందరిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ క్రమంలో భార్య భర్తల పరిస్ధితి విషమించి సాయిలు మృతి చెందగా, భార్య రేఖకు ప్రాణాపాయం ఉండటంతో వెంటిలెటర్ పై చికిత్స అందిస్తున్నారు. ఇద్దరు పిల్లలకు ప్రాణాపాయం లేదని చికిత్స అందిస్తున్నామని డాక్టర్లు పేర్కొన్నారు. ఆర్థిక సమస్యలతో కుటుంబం మొత్తం సామూహిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉంటారని స్థానికులు పేర్కొంటుండగా అసలు కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలాన్ని స్థానిక ఎడపల్లి పోలీసులు పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై పాండేరావు తెలిపారు.