కామారెడ్డి, డిసెంబరు 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 9038 స్వయం సహాయక సంఘాలకు రూ.529.25 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందజేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ఐకెపి అధికారులతో బ్యాంకు లింకేజీ రుణాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
15 వేల 319 స్వయం సహాయక సంఘాలకు రూ.854.80 కోట్లు బ్యాంక్ లింకేజీ రుణాలు అందించాలనే లక్ష్యం పెట్టుకున్నారని చెప్పారు. ఈ రుణాలతో మహిళలు సోలార్ యూనిట్లు, డెఈరీ, చేపల పెంపకం, గేదెల పెంపకం, పాలు పితికే యంత్రాలు తీసుకునే విధంగా సమన్వయకర్తలు ప్రణాళికలు తయారు చేయాలన్నారు.
1634 స్వయం సహాయక సంఘాలు రూ.12.69 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు బకాయిలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆర్‌ఆర్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. గాంధారి, జుక్కల్, మద్నూర్, నస్రుల్లాబాద్ మండలాల్లో బ్యాంక్ లింకేజీ రుణాలు బకాయిలు ఉన్నాయని వాటికోసం బ్యాంకు లింకేజీ స్పెషల్ కమిటీల ద్వారా వసూళ్లు చేపట్టాలని పేర్కొన్నారు. సమావేశంలో డిఆర్‌డిఓ సాయన్న, అదనపు డిఆర్‌డిఓ బి. మురళీకృష్ణ, డిపిఎంలు రవీందర్ రావు, సుధాకర్, రమేష్ బాబు, జ్ఞాన్, వకుల, ఏపీఎంలు పాల్గొన్నారు.