ఆర్మూర్, డిసెంబరు 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అన్ని కులాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అండదండలు అందిస్తున్నదని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్-మామిడిపల్లి శివారులో చేపట్టిన మేస్త్రీ మున్నూరు కాపు సంఘం భవనానికి సోమవారం జరిగిన భూమి పూజ కార్యక్రమంలో జీవన్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సకల వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమన్నారు. కేసీఆర్ అధ్బుతమైన పాలనతో వ్యవసాయ రంగంలో పురోగమిస్తున్న తెలంగాణ రాష్ట్రం శ్రమైక్య సౌందర్యానికి ప్రతీక అని ఆయన అభివర్ణించారు. మేస్త్రీ మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణం రూ.10 లక్షల వ్యయంతో చేపడుతున్నామన్నారు. మరో రూ.5 లక్షలతో ఈ సంఘం భవనానికి విద్యుత్ సౌకర్యం కలిపిస్తున్నామన్నారు.
కాగా ఆర్మూర్ నియోజక వర్గం పరిధిలో మున్నూరుకాపు, పద్మశాలి, బంజారా, దేవాంగ తదితర సంఘాల కోసం మొత్తం ఆరు మల్టీపర్పస్ కమ్యూనిటీ హాళ్లను నిర్మిస్తున్నామన్నారు. వివిధ సామాజిక వర్గాల కోసం చేపట్టిన మొత్తం 133 కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం పనులను వచ్చే మూడు నెలలలోగా పూర్తి చేసి ప్రారంభోత్సవం చేసే విధంగా చర్యలు తీసుకున్నామని జీవన్ రెడ్డి తెలిపారు.
కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ షేక్ మున్ను, కౌన్సిలర్లు రవి గౌడ్, ఇట్టెడి నర్సారెడ్డి, సీనియర్ నాయకులు మోత్కూరి లింగా గౌడ్, కాటి రెడ్డి, మేస్త్రీల మున్నూరు కాపు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.