ఎడపల్లి, డిసెంబరు 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాలల హక్కులతో పాటు వారి భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఎంపీపీ శ్రీనివాస్, ఏసిడిపిఓ జానకి అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో మండల బాలల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ శ్రీనివాస్, ఏసిడిపిఓ జానకి మాట్లాడారు.
చదువుకు దూరంగా ఉన్న పిల్లలు, వీధి బాలలు, భిక్షాటన చేస్తున్నవారు, ఇటుక బట్టీలలో పనిచేస్తున్న బాల కార్మికులు అందరు కూడా చదువుకునేలా చూడాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే మేజర్ ఆడ పిల్లలకు వివాహాలు జరిపించాలని ఎట్టి పరిస్థితులలోనూ బాల్య వివాహాలు జరగకుండా చూడాలని అన్నారు. ప్రభుత్వం బాల్య వివాహాలు అరికట్టేందుకు కఠినమైన చట్టాలను రూపొందించిందని అన్నారు.
బాల్య వివాహాలను ఎవరు కూడా ప్రోత్సహించకూడదన్నారు. గ్రామస్థాయి నుండి, మండల, జిల్లా స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేసిన్నట్లు తెలిపారు. ఎక్కడికక్కడ కమిటీలు సమర్ధవంతంగా పనిచేస్తే బాల్యవివాహాలు, వీధి బాలలు, బాల కార్మికులు లేని సమాజాన్ని రూపొందించవచ్చని అన్నారు. సమావేశంలో ఎంపీడీవో గోపాలకృష్ణ, సిడిపిఓ వినోద, సర్పంచులు ఆకుల మాధవి శ్రీనివాస్, భాస్కర్ రెడ్డి, డిసిపిఓ చైతన్య, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కిరణ్మయి, ప్రకాష్ రావు, తదితరులు ఉన్నారు.