నిజామాబాద్, డిసెంబరు 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆశా వర్కర్ల ఆందోళనలో భాగంగా వంటావార్పు చేస్తూ సోమవారం రాత్రి చలిలో మహిళలంతా ధర్నా చౌక్ లోనే నిద్రించి తమ నిరసన తెలిపారు. మంగళవారం రెండవ రోజు కూడా పెద్ద ఎత్తున ఆశ వర్కర్లు తమ సమస్యలపై నినాదాలతో ధర్నా చౌక్‌ను హోరెత్తించారు.
ఈ సందర్భంగా ఆశ వర్కర్ల ఆందోళనకు సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆశ వర్కర్లతో వెట్టి చాకిరి చేయించుకుంటూ తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు.
కార్మికుల సమస్యలను పట్టించుకోవటం లేదని, కనీస వేతనాలు అమలు జరపకుండా వివక్షతను ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. వర్కర్ల సమస్యలను పరిష్కరించని ఎడల ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ధర్నా చౌక్ నుండి పాదయాత్రగా నినాదాలు చేస్తూ ఎన్టీఆర్ చౌరస్తా రైల్వే కమాన్ జిల్లా పరిషత్ సుభాష్ నగర్ దుబ్బ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు.
అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ కు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. స్థానిక సమస్యల పరిష్కారానికి గతంలో అధికారులు ఇచ్చిన హామీలు అమలు జరగటం లేదని, వాటిని వెంటనే పరిష్కరించాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆశ వర్కర్ల యూనియన్ జిల్లా నాయకులు విజయ, రేణుక, శాంతి, లావణ్య, దివ్య, శోభ, నర్సు, లత తదితరులు పాల్గొన్నారు.