నిజామాబాద్, డిసెంబరు 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో శానిటేషన్, హరితహారం నిర్వహణను మరింతగా మెరుగుపర్చుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో మంగళవారం స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ అంశంపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పచ్చదనాన్ని పెంపొందించేందుకు వీలుగా హరితహారం కింద నాటిన మొక్కలను పూర్తి స్థాయిలో సంరక్షించాల్సిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తించాలని, ఎక్కడైనా మొక్కలు ఎండిపోతే వాటి స్థానంలో కొత్తగా మొక్కలు నాటాలని ఆదేశించారు. అన్ని రహదారులకు ఇరువైపులా మొక్కల నిర్వహణ సజావుగా జరిగేలా నిరంతరం పర్యవేక్షణ జరపాలని అన్నారు.
ఇప్పటికే అనేక విడతలుగా పెద్ద మొత్తంలో మొక్కలు నాటినందున, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, నాటిన ప్రదేశాల్లోనే తిరిగి మొక్కలు నాటే పరిస్థితి ఉత్పన్నం కాకుండా చూసుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హరితహారం కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించకపోతే చెడ్డ పేరు వస్తుందని, ఈ తరహా అలసత్వాన్ని ప్రదర్శించే వారిని ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
పారిశుధ్యం నిర్వహణ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని, నివాస ప్రాంతాలతో పాటు, ప్రధాన రహదారులకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలు, చెత్త చెదారాన్ని తొలగించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హరితహారం, శానిటేషన్ నిర్వహణలో ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. తాను ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని, ఎక్కడైనా అస్తవ్యస్త పరిస్థితులు కనిపిస్తే సంబంధిత ఎంపీఓలు, కార్యదర్శులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు.
బృహత్ పల్లె ప్రకృతి వనాల నిర్వహణను సైతం క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ, ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే సరిచేసుకోవాలని సూచించారు. అనుమతులు తెలిపిన అన్ని ప్రాంతాల్లోనూ తెలంగాణ క్రీడా ప్రాంగణాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయించాలని అన్నారు. క్రీడా ప్రాంగణాలు అవసరమైన సామాగ్రిని సమకూర్చుకోవాలని, ఆడిట్ ఇబ్బందులు రాకుండా అందుకు సంబంధించిన సమగ్ర వివరాలను పక్కాగా రిజిస్టర్లో పొందుపర్చాలని సూచించారు. సమావేశంలో డీఆర్డీఓ చందర్, డీపీఓ జయసుధ, జెడ్పి సీఈఓ గోవింద్, డీఎల్‌పీఓలు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.