నిజామాబాద్, డిసెంబరు 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు క్షేత్ర స్థాయి సిబ్బంది మొదలుకుని వైద్యాధికారుల వరకు ప్రతి ఒక్కరు అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ పనితీరుపై కలెక్టర్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. గత నవంబర్ మాసంలో జిల్లాలో మొత్తం 2784 కాన్పులు జరుగగా, అందులో 57 శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో, 43 శాతం ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగాయని అన్నారు.
ఇదివరకటితో పోలిస్తే పరిస్థితి కొంత వరకు మెరుగుపడినప్పటికీ ఇంకనూ చాలావరకు మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం 65 శాతం ప్రసవాలు జరగాలని, ఈమేరకు లక్ష్య సాధన కోసం ప్రణాళికాబద్ధంగా పని చేయాలని హితవు పలికారు. లక్ష్య సాధనలో వెనుకబడిన పీ హెచ్ సి ల మెడికల్ ఆఫీసర్లు, సిబ్బందిని కలెక్టర్ కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నెలాఖరు నాటికి పరిస్థితి మెరుగుపడాలని, లక్ష్య సాధనలో అలసత్వం ప్రదర్శించే వారిపై వేటు తప్పదని హెచ్చరించారు.
వైద్యారోగ్య శాఖలో సమూల మార్పులు తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, అందుకు అనుగుణంగానే క్షేత్ర స్థాయిలోనూ కృషి జరిగినప్పుడే ప్రభుత్వం ఆశిస్తున్న ఫలితాలు వస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. నిజామాబాద్ లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రితో పాటు ఆర్మూర్, బోధన్ హాస్పిటళ్లలో అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నందున ప్రతి కాన్పు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగేలా చూడాలని, ఈ దిశగా ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేందుకు క్షేత్రస్థాయిలో ఆశ వర్కర్లు, ఏ.ఎన్.ఎంలు గట్టిగా కృషి చేయాలన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరిన మీదట కొంతమంది గర్భిణీలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి కాన్పులు చేయించుకుంటున్నారని, ఇలా ఎందుకు జరిగిందన్నది లోతుగా విశ్లేషించుకుని ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిచేసుకోవాలని సూచించారు. మెరుగైన సేవలందిస్తూ, రోగులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ప్రభుత్వాసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందుతుందని భరోసాను కలిగిస్తే తప్పనిసరిగా కోరుకున్న మార్పు సాధించగల్గుతామని అన్నారు. రక్తహీనతతో బాధపడే గర్భిణీల ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, కనీసం మూడు పర్యాయాలు వారికి రక్త పరీక్షలు జరిపించాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రతి గర్భిణీకి సంబంధించిన వివరాలను తప్పనిసరిగా ఆన్లైన్ లో నమోదు చేయాలన్నారు. కాగా, జనవరి 18 నుండి ప్రారంభం కానున్న కంటి వెలుగు కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని సూచించారు. కంటి వెలుగు శిబిరాల నిర్వహణ గురించి ముందస్తుగానే విస్తృత ప్రచారం చేస్తూ ప్రజల్లో అవగాహన పెంపొందించాలన్నారు. వీడియో కాన్ఫరెన్సులో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శనం, జిల్లా ఇమ్యూనైజషన్ అధికారి అశోక్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్ తదితరులు పాల్గొన్నారు.