ఎల్లారెడ్డి, డిసెంబరు 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మెరుగైన వైద్యం అందించడానికి తన పూర్తి సహకారం ఉంటుందని త్వరలోనే ఎల్లారెడ్డి లోని వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో గర్భిణీ మహిళలకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీకి విచ్చేసిన మంత్రి హరీష్ రావును ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ కలిసి విన్నవించగా పై విధంగా స్పందించారు. ఎల్లారెడ్డి ప్రాంతం తెలంగాణ ప్రాంత ఉద్యమానికి అడ్డా అని ఆ ప్రాంతంలోని అన్ని రకాల వైద్య సమస్యలను దశలవారీగా పరిష్కరించి మెరుగైన వైద్యం ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
దానిలో భాగంగానే ఎమ్మెల్యే వినతి మేరకు ఎల్లారెడ్డిలో డయాలసిస్ సెంటర్ గిరిజన ప్రాంతమైన గాంధారిలో 24 గంటలు వైద్య సేవలు అందించడానికి ఆస్పత్రిని స్థాయి పెంచడం జరిగిందన్నారు అంతేకాకుండా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కూడా పల్లె దావకానల ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తానన్నారు.
అన్ని మండలాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్యం అందించడానికి ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తెచ్చినట్లయితే వెంటనే పరిష్కరిస్తానన్నారు. మంత్రిని ఎమ్మెల్యేతో పాటు సదాశివనగర్ మాజీ జెడ్పిటిసి పడిగెల రాజేశ్వరరావు, గాంధారి మండలానికి చెందిన మాజీ డిసిఎం డైరెక్టర్ ముకుందరావు పాల్గొన్నారు.