ఆర్మూర్, డిసెంబరు 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పట్టణవాసి తాటి గొల్ల ప్రవీణ్ కుమార్ (41) గత ఏప్రిల్ నెలలో 20 రోజుల విజిట్ వీసాపై ఏజెంట్ మాటలు నమ్మి మలేషియా దేశంలోని కౌలాలంపూర్‌కు వెళ్లి అక్కడ ఉద్యోగం లేక ఇండియాకు తిరిగి రాలేక తిప్పలు పడుతున్నాడు.
అక్కడ సుమారుగా 8 నెలల నుండి సందర్శక వీసా మీద ఉండడంతో అక్కడి చట్టాల ప్రకారం లక్షలాది రూపాయలు పెనాల్టీ కట్టలేక దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. పంపిన ఏజెంట్ ముఖం చాటేయడంతో ప్రవీణ్ భార్య మనోరమ ఆర్మూర్‌లోని ప్రవాస భారతీయుల హక్కులు సంక్షేమ వేదిక అధ్యక్షులు కోటపాటి నరసింహనాయుడును కలిసి తన భర్తను ఏవిధంగానైనా ఇంటికి రప్పించి తన కుటుంబాన్ని కాపాడాల్సిందిగా పేర్కొన్నారు.
కోటపాటి వెంటనే స్పందించి మలేషియాలో తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షులు కిరణ్ గౌడ్‌ను సంప్రదించి ప్రవీణ్ కుమార్‌ను స్వదేశానికి పంపడానికి ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు.