రెంజల్, డిసెంబరు 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండల కేంద్రంలో వృద్ధ దంపతులపై గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి నగలను అపహరించినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన జల్ల చిన్న నాగన్న, శకుంతల అనే దంపతులు గురువారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి వారిపై దాడి చేసి నగలను అపరిచారని అన్నారు.
శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో వారి మనవడు అయిన వర్ధన్ రోజు మాదిరిగా ఇంటికి వచ్చి చూడగా వృద్ధ దంపతులు అపస్మారక స్థితిలో పడి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న రెంజల్ ఎస్సై సాయన్న అపస్మారక స్థితిలో ఉన్న దంపతులను 108 అంబులెన్స్ ద్వారా జిల్లా ఆసుపత్రికి తరలించారు.
సమాచారం తెలుసుకున్న బోధన్ ఎసిపి కిరణ్ కుమార్, సిఐ శ్రీనివాస్ రాజ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సంఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకుని డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీం ద్వారా తనిఖీ చేపట్టారు. ఘటనకు బాధ్యులైన వ్యక్తులను త్వరలోనే పట్టుకుంటామని ఏసిపి కిరణ్ కుమార్ అన్నారు.
ప్రస్తుతం దంపతుల ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ఇళ్లలో ఒంటరిగా నివసించే మహిళలు, వృద్ధ దంపతులు జాగ్రత్తగా ఉండాలని గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తే పోలీసువారికి సమాచారం అందించాలని అన్నారు. మనవడు వర్ధన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయన్న తెలిపారు.