నిజామాబాద్, డిసెంబరు 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు తమ పంటలను ఆరబెట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కల్లాలు కట్టొద్దంటే రైతుల పక్షాన బీజేపీ నాయకుల గల్లాలు పట్టి నిలదీస్తామని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి హెచ్చరించారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో రైతు కల్లాల నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం నిజామాబాద్ నగరంలోని కలెక్టర్ కార్యాలయం దగ్గర బీఆర్‌ఎస్ జిల్లా శాఖ ఆద్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు.
కార్యక్రమంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో ఉన్నది రైతు వ్యతిరేక ప్రభుత్వమని మరోమారు తేటతెల్లమయిందన్నారు. ప్రధాని మోడీ కార్పొరేట్ రక్షకుడు, కర్షక భక్షకుడు అని, బీఆర్‌ఎస్‌ది రైతు సిద్ధాంతం, వారి హక్కుల కోసం పోరాటం అని, బీజేపీది కేవలం ఓట్ల కోసం రాద్ధాంతం అని మోడీ పాలనలో వ్యవసాయానికి ‘‘సాయం’’లేదు ‘‘గాయం’’ తప్ప అని, రైతుకు సుఖం లేదు దుఃఖం తప్ప అని, తెలంగాణ రైతుల పట్ల కేంద్రానికి ఎందుకీ క్షక్ష, కోపం, వివక్ష అని జీవన్‌రెడ్డి విరుచుకుపడ్డారు.
మోడీ దుర్మార్గపు పాలనలో దగాపడిన రైతులంతా కేసీఆర్ వైపు చూస్తున్నారని, కేసీఆర్ అసలుసిసలైన ‘‘రైతు బంధువు అని, మోడీ రైతుల పాలిట రాబంధులా మారారన్నారు. కేసీఆర్ పాలన రైతులకు స్వర్ణ యుగంగా మారిందని, బీఆర్‌ఎస్ అంటే ‘‘రైతుల సంక్షేమ సమితి’’ అని, బీజేపీ అంటే రైతు వ్యతిరేక పార్టీ అని, రైతులను నిలువునా ముంచుతున్న బీజేపీ నేతలను గ్రామాల్లో తిరగనివ్వమని, రైతులకు అండగా ఎర్రకోటపై గులాబీ జెండా ఎగురేసి తీరుతాం అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
బీఆర్ ఎస్ రైతు బంధు పార్టీ అయితే బీజేపీ రైతు రాబంధు పార్టీ అని మరోసారి రుజువైందన్నారు. రైతుల ఓట్లతో రాజ్యమేలుతున్న మోడీ సేద్యానికే గోరీ కడుతున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీ ముమ్మాటికీ గుజరాతీ బేరగాళ్ల పార్టీయే తప్ప రైతులను ఉద్దరిచ్చే పార్టీ కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం పచ్చి రైతు వ్యతిరేకి అని, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రైతులపై మోడీ సర్కారు కక్షగట్టిందని, రైతులకు కల్లాలు కట్టడం ఎలా తప్పవుతుందన్నారు.
ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలలో ఉపాధిహామీ కింద కల్లాల నిర్మాణం జరుగుతున్నదని, కానీ తెలంగాణ విషయంలో మాత్రమే ఎందుకింత సవతి తల్లి ప్రేమ? అని, పెరిగిన సాగునీటి వసతుల వల్ల పంటల ఉత్పత్తి పెరిగి కల్లాలు లేక రైతులు ధాన్యం రోడ్ల మీద పోసు కుంటున్నారన్నారు. ఉపాధిహామీ పథకాన్ని పార్లమెంటులో ప్రధాని మోడీ అపహాస్యం చేశారన్నారు.
తప్పనిసరి పరిస్థితులలో దానిని కొనసాగిస్తున్నారని, సాగునీటి రాకతో సేద్యం పెరిగి తెలంగాణలో పనులు పెరిగాయని, ఇతర రాష్ట్రాల నుంచి వలస వస్తున్నారని, వ్యవసాయ రంగంలో కూలీల కొరత వస్తుందని గ్రహించి మొట్టమొదట వ్యవసాయానికి ఉపాధిహామీ పథకాన్ని అనుసంధానం చేయాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేసిందన్నారు.
2014, 2019 బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉపాధిహామీని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని హామీ ఇచ్చి విస్మరించిందని, 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి పెట్రోల్, డీజిల్, ఎరువుల ధరలు పెంచి సాగు ఖర్చులు పెంచారన్నారు. 60 ఏళ్లు నిండిన రైతులకు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని, రూ.లక్ష కోట్లతో వ్యవసాయంలో మౌళిక సదుపాయాల కల్పన చేస్తామన్న హామీ ప్రకటనలకే పరిమితం అయిందని జీవన్ రెడ్డి అన్నారు.
స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తామని 2013 సెప్టెంబరులో గాంధీనగర్‌లో జరిగిన సదస్సులో మోడీ స్వయంగా ప్రకటించారని, స్వామినాథన్ సిఫార్సులకు భిన్నంగా కొత్త ఫార్ములాను అమలుచేస్తూ మద్దతుధర ఇస్తున్నామని రైతులకు శఠగోపం పెట్టారన్నారు. కనీస మద్దతుధరల అమలుకు చట్టం తెస్తామని చెప్పిన మోడీ దానిని పూర్తిగా పక్కనపెట్టారని, జాతీయ ఉపాధి హామీ పథకం కింద కల్లాలు కడితే 150 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించాలని కేంద్రం కొర్రీ పెట్టిందన్నారు.
చేపలు ఆరబోసుకునేందుకు కొన్ని రాష్ట్రాల్లో కల్లాలకు అనుమతిచ్చిన కేంద్రం వడ్ల కల్లాలకు అనుమతి ఇవ్వదా?, తెలంగాణ రైతుల పట్ల కేంద్రానికి ఎందుకింత క్షక్ష ,కోపం, వివక్ష? అని మండిపడ్డారు. రైతులు వడ్లు ఆరబోసుకునేందుకు కల్లాలు కడితే ఎలా తప్పు? అవుతుందని, రైతుల కల్లాలపై ఎందుకింత కల్లోలం అని, కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీల పొట్ట గొడుతోందన్నారు.
రైతుల పొట్టగొట్టి దళారులకు దోచి పెట్టడమే బీజేపీ ప్రభుత్వం పని అని, సాగు చట్టాలు తెచ్చి రైతులను కార్లతో తొక్కించి, తుపాకులతో కాల్చి చంపారని, ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడిచారని, బీజేపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక దమననీతిని రైతాంగం అర్ధం చేసుకోవాలన్నారు. దమ్మున్న నేత కేసీఆర్ నాయకత్వంలో బీఆర్‌ఎస్ రైతుల కొమ్ముకాస్తుంది, బీజేపీ రైతు వ్యతిరేక విధానాలను వమ్ముచేస్తుంది అని జీవన్ రెడ్డి అన్నారు.
రైతుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నన్ని పథకాలు మరెక్కడా లేవని, రైతుబంధు పథకం ద్వారా ఏడాదికి ఎకరానికి రూ.10 వేల చొప్పున పెట్టుబడి సాయం చేస్తూ ఇప్పటికే రూ.50 వేల కోట్ల రూపాయలను రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిందన్నారు. ఏ కారణం చేతనైనా రైతులు మరణించిన సమయంలో వారి కుటుంబ సభ్యులకు అండగా నిలిచేందుకు రైతు బీమా ద్వారా రూ.5 లక్షల చొప్పున 72 గంటల లోపు బీమా సొమ్ము చెల్లిస్తున్నారన్నారు.
మిషన్ కాకతీయ ద్వారా చెరువులు నింపి అదనపు ఆయకట్టుకు నీరిస్తున్నామని, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రతీ ఎకరాకు సాగునీటిని సరఫరా చేస్తున్నామన్నారు. ఎస్‌ఆర్‌ఎస్‌పీ రివర్స్ పంపింగ్ ద్వారా నిజామాబాద్ జిల్లాకు సాగు నీరు అందుతోందని, ఆర్మూర్ పంటపొలాలతో పాటు గుత్ప ప్రాజెక్టుకు నీరు విడుదలవుతోందన్నారు. రూ.41 వేల కోట్లు ఖర్చు చేసి వ్యవసాయానికి ఇరవై నాలుగంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నారని, రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో సరఫరా అవుతున్నాయన్నారు.
పంటలను ప్రభుత్వమే కొంటున్నదని, రైతులు తమ పంటలను భద్ర పరుచుకోవడానికి గోదాంలు నిర్మించారని జీవన్ రెడ్డి వివరిస్తూ ఇవన్నీ చేసింది కేసీఆర్.. అవునా?,కాదా,? అని ప్రశ్నించినప్పుడు అవును..అవును అని వేలాది మంది రైతులు ముక్తకంఠంతో నినదించారు. మన ప్రభుత్వం ఇన్ని పథకాలు అమలు చేస్తుంటే ఎంపీ అరవింద్ ఏం పీకుతున్నాడు?. కేంద్రంతో మాట్లాడి రైతులకు నయా పైసా ఇప్పించాడా?. బండిసంజయ్, అరవింద్‌లవి బొడిగుండ్లు. నీ వెంట్రుకలు ఇస్తావా అని కేటీఆర్ వెంటపడటం తప్ప ఏనాడైనా రైతులను పట్టించుకున్నారా? అని జీవన్ రెడ్డి మండిపడ్డారు.
కాగా రైతుల సంక్షేమానికి ఇంకా ఎన్నో పథకాలు అమలు చేస్తూ సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతిగా చరిత్రకెక్కారన్నారు. ఇలాంటి పథకాలు దేశంలోనే కాదు ప్రపంచములో ఎక్కడైనా ఉన్నాయా?. టీఆర్ ఎస్ ప్రభుత్వ పథకాలు ప్రజలనాకర్షిస్తున్నాయని, అందుకే పల్లెలు,పట్టణాలు అనే తేడా లేకుండా ప్రజలందరి నడక కారు, సారు, కేసీఆర్ వైపే సాగుతోంది అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ పథకాలు అన్ని రాష్ట్రాలలో అమలు జరగాలంటే ప్రజలు దేశ నాయకత్వ బాధ్యతలు కేసీఆర్‌కు అప్పగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఇందుకోసం యావత్ తెలంగాణ ప్రజలు కారు, సారు, కేసీఆర్ వెంటే నడవాలని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, ఎమ్మెల్సీ విజి గౌడ్, ఉమెన్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ ఆకుల లలిత, మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, మేయర్ నీతూ కిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డిలతో పాటు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ అధ్యక్షులు, ఎంపీపీ ఉపాధ్యక్షులు సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.