నిజామాబాద్, డిసెంబరు 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వినియోగదారులు తమ హక్కుల గురించి అవగాహనను పెంపొందించుకోవాలని జిల్లా వినియోగదారుల ఫోరమ్ చైర్ పర్సన్ సువర్ణ జయశ్రీ సూచించారు. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై వినియోగదారుల హక్కులు, చట్టాల గురించి అవగాహన కల్పించారు.
ఇటీవలి కాలంలో ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసి వినియోగదారులు తమకు అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తున్నారని, ఈ సందర్భంగా ఎదురయ్యే మోసాలు, నష్టాలకు సంబంధించి కూడా వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేసేలా వెసులుబాటు కల్పించడం జరిగిందన్నారు.
వినియోగదారుడు నష్టపోయిన, లేదా మోసపోయిన సందర్భాల్లో వారికి న్యాయం జరిపించేందుకు సంబంధిత యంత్రాంగం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు, వినియోగదారుల సంఘాల బాధ్యులు, రేషన్ డీలర్లు, వివిధ ఏజెన్సీ ల ప్రతినిధులు పాల్గొన్నారు.