ఆర్మూర్, డిసెంబరు 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న రోడ్లను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పీయూసీ ఛైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ – నందిపేట్ ప్రధాన రహదారిలో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం బయలు దేరిన జీవన్ రెడ్డి రోడ్డుపై వెళ్ళుతున్న కేజ్ వీల్ ట్రాక్టర్‌ను చూసారు. వెంటనే ఆయన ఆగి నేరుగా ట్రాక్టర్ నడుపుతున్న వ్యక్తి దగ్గరకు వెళ్లి మందలించారు.
ట్రాక్టర్ కేజ్‌వీల్స్‌కు ఇనుప పట్టీలు ఏర్పాటు చేసుకోవాలని, రోడ్డు దెబ్బతిన్నకుండా ప్రతీ ఒక్కరూ బాధ్యత వహించాలని ఆయన హితవు పలికారు. పోలీస్ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరైనా సరే రోడ్లను ధ్వంసం చేస్తే తగిన చర్యలు తీసుకోవాలని జీవన్ రెడ్డి ఆదేశించారు.
తారురోడ్లపై కేజ్‌వీల్స్ ట్రాక్టర్లు నడపడం వల్ల రోడ్లు దెబ్బతింటాయన్నారు. ఈ నేపథ్యంలో రోడ్ల రక్షణకు కేజ్‌వీల్స్‌కు ఇనుప పట్టీలను ఉపయోగించుకునేలా పోలీస్ అధికారులు గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వివరించాలని జీవన్ రెడ్డి పోలీస్ అధికారులకు సూచించారు