భీంగల్, డిసెంబరు 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు రూ.వందల కోట్ల నిధులను ఖర్చు చేస్తూ గ్రామ గ్రామాన నూతనంగా నిర్మిస్తున్న బీ.టీ రోడ్లను పది కాలాల పాటు మన్నికగా ఉండేలా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హితవు పలికారు.
భీంగల్ మండలంలో అభివృద్ధి పనులకు శనివారం మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా భీంగల్ మండలము దేవక్కపేట నుండి కారేపల్లి వరకు ఇటీవల నూతనంగా వేసిన బిటి రోడ్ పై కేజ్ వీల్ నడిచిన గుర్తులు ఉండటంతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన వాహనం దిగి పరిశీలించారు. కోట్లాది రూపాయలతో ప్రభుత్వం రోడ్లు వేస్తుంటే, పట్టీలు లేకుండా కేజ్ వీల్ వాహనాలను నడిపి రోడ్లను ధ్వంసం చేయడం సరికాదన్నారు.
వాహనాలను నడుపుతున్న యజమానులకు అవగాహన కల్పించాలని తన వెంట ఉన్న పోలీస్ అధికారులను మంత్రి ఆదేశించారు. కొత్తగా వేసిన బీ.టీ రోడ్డు కనీసం ఏడెనిమిది సంవత్సరాల పాటు మన్నికగా ఉండాలని, కేజ్ వీల్స్ వాహనాలను నడపడం వల్ల పగుళ్లు ఏర్పడి కొన్నాళ్లకే అవి చెడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
దీనివల్ల కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అవుతోందని అన్నారు. రోడ్లను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రి కోరారు. ఏ గ్రామానికి ఆ గ్రామంలో స్థానికులు సమావేశం ఏర్పాటు చేసుకోని రోడ్లపై కేజ్ వీల్ వాహనాలను పట్టీలు లేకుండా నడపబోమని తీర్మానాలు చేయాలని, ఆ తీర్మానం ప్రతులను మండల తహశీల్దార్‌కు అందజేయాలన్నారు. ఈ మేరకు తీర్మానం చేసుకోనంత వరకు ఆ గ్రామాల గుండా వేయాల్సిన బిటి రోడ్లు ఉంటే ఆ పనులను ప్రారంబించవద్దు అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులకు సూచించారు.