నిజామాబాద్, డిసెంబరు 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగర శివారులోని చిన్నాపూర్ వద్ద గల అర్బన్ పార్క్‌ను కలెక్టర్ సి.నారాయణరెడ్డి మంగళవారం సందర్శించారు. తుది దశకు చేరిన వివిధ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఓపెన్ జిమ్‌లు, ప్లే జోన్ ఏరియా, కల్వర్టుల నిర్మాణాలు, పర్కులేషన్ ట్యాంకులు, వాచ్ టవర్, రోడ్డు నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించి ఫారెస్ట్ అధికారులకు పలు సూచనలు చేశారు.
చిల్డ్రన్స్ పార్క్ పనులను యుద్ధ ప్రాతిపదికన జరిపించాలని, తుదిదశలో మిగిలిఉన్న పనులను కూడా సత్వరమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పార్కు ప్రధాన మార్గంతో పాటు మెయిన్ రోడ్డు మీదుగా రాకపోకలు సాగించే వారికి అర్బన్ పార్కు ఆకర్షించేలా అందంగా తీర్చిదిద్దాలని, అందమైన పూల మొక్కలు, ఆకట్టుకునే పెయింటింగ్స్ వేయించాలన్నారు. ప్రవేశ ద్వారం నుండి నలువైపులకి వెళ్లే మార్గాలను సుందరంగా తీర్చిదిద్దాలన్నారు.
ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటుతూ పచ్చదనాన్ని పెంపొందించాలని అన్నారు. అందమైన పూల మొక్కలతో పాటు అన్ని రకాల మొక్కలను పెంచాలని సూచించారు. ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనుల నాణ్యతలోనూ రాజీ పడకుండా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని సూచించారు. అటవీ ప్రాంతాల్లో ఉండే మొక్కలన్నీ అర్బన్ పార్క్‌లోను కనిపించాలన్నారు. అర్బన్ పార్కుకు వచ్చే సందర్శకుల సౌకర్యార్థం అవసరమైన సదుపాయాలన్నీ నెలకొల్పాలని సూచించారు. కలెక్టర్ వెంట డీపీఓ జయసుధ, ఎఫ్‌డీఓ భవాని శంకర్, ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.