నిజామాబాద్, డిసెంబరు 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో మంగళవారం సుభాష్ నగర్‌లోని నెహ్రూ యువ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విపత్తు నిర్వహణ శిక్షణను జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ విజయవాడకు చెందిన 10వ బెటాలియన్ కమాండెంట్ బిట్వీన్ సింగ్ నేతృత్వంలోని 20 మంది ఎన్‌డిఆర్‌ఎఫ్ సైనికుల బృందం శిక్షణను ఇచ్చింది.
అగ్నిప్రమాదాలు, జల ప్రమాదాలు,వరదలు, భూకంపాలు, గ్యాస్ లీకేజీ, పేలుడు ఇతర విపత్కర పరిస్థితుల్లో అత్యవసరంగా, సమయస్ఫూర్తి తో మనం ఎలా వ్యవహరించాలి, ఎలా మనల్ని మనం కాపాడుకొని, ప్రజలను కాపాడాలి, సాధారణ పౌరులు, సైనికులు, పోలీసులకు ఎలా సహకరించాలి అనే విషయాల మీద ఉదయం 10గం ల నుండి సాయంత్రం 4గం వరకు శిక్షణ ఇచ్చారు.
శిక్షణ ప్రారంభంలో కార్యక్రమ నిర్వహకురాలు, జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ బెల్లాల్ మాట్లాడుతూ ఇలాంటి శిక్షణ ప్రతీ ఒక్కరికీ అవసరమని, ప్రమాదాలను ఎలా ఎదుర్కోవాలి, ఆ సమయంలో ఏం చెయ్యాలి అనే అవగాహన కలిగి వుండటం మనందరి బాధ్యత అని కాబట్టి ఈ శిక్షణ ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ శిక్షణ నిర్వహణ అవకాశాన్ని ఇచ్చినందుకు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందానికి, జిల్లా కలెక్టర్‌కి ధన్యవాదాలు తెలిపారు.
ఈ శిక్షణలో విపత్తు నిర్వహణలో వ్యవహరించాల్సిన పద్ధతులను మౌఖికంగా వివరిస్తూ, ప్రాక్టికల్‌గా అబ్బురపరిచే సహసాలను చూపించారు. కార్యక్రమంలో నిజామాబాద్ ఉత్తర మండల డిప్యూటీ తహసీల్దార్ కార్తీక్ రెడ్డి, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం సభ్యులు, 50 మంది యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విపత్తు నిర్వాహణ బృందం సభ్యులను నెహ్రూ యువ కేంద్ర తరుపున జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ ఘనంగా సన్మానించారు.