నిజామాబాద్, డిసెంబరు 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతాపార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ బీజేపీ నాయకులు వినయ్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ 2014 ఎన్నికల హామిలో భాగంగా టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ టిఆర్‌ఎస్ పార్టీని గెలిపిస్తే ఏకకాలంలో లక్ష రూపాయల వరకు ఉన్న రైతుల రుణాన్ని మాఫీ చేస్తానని చెప్పి గెలిచి అధికారంలోకి వచ్చాక ఏకకాలంలో మాఫీ చేయకుండా ఏడాదికి 25 శాతం చొప్పున నాలుగు విడతల్లో మాఫీ అంటూ కొత్త నాటకానికి తెరదీసి రైతులను మోసం చేసాడని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎన్నికలు వస్తే గాని ఈ ప్రభుత్వానికి రైతులు గుర్తుకు రారని, ఎన్నికలు వచ్చిన ప్రతిసారి రైతులకు కేసీఆర్ అమలుకు సాధ్యం హామీలు ఇస్తూ రైతులను మోసం చేస్తున్నాడని, తమది రైతు అనుకూల ప్రభుత్వం అని చెప్పుకుంటున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి నిజంగా రైతులకు ఇచ్చిన హామిపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఏకకాలంలో రైతుల రుణాన్ని మాఫీ చేయాలని డిమాండ్ చేసారు.
అదే విధంగా ధరణి పోర్టల్ అనేది ఒక అక్రమాల పుట్ట, లోపాల పుట్ట అని, ఈ పోర్టల్‌తో రైతులు రోజుకో కొత్త సమస్య ఎదురుకుంటున్నారని, ఉన్న భూమిని లేనట్టు లేని భూమిని ఉన్నట్టు చూపిస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. ధరణి పోర్టల్ టిఆర్‌ఎస్ నాయకుల కోసమే అన్నట్లు తయారైందని, పేదల, గిరిజనుల భూములను కాజేయడానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంచుకున్న వ్యూహమే ధరణి పోర్టల్ అని, ఈ పోర్టల్‌ను ఆసరగా చేసుకొని అవినీతి టిఆర్‌ఎస్ నాయకులు పేదల భూములను గుంజుకుంటున్నారని, వెంటనే ధరణిలో ఉన్న సాంకేతిక లోపాలను సరి చేసి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు రాకుండా చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాలలోని ప్రతి మండల కేంద్రంలో, ప్రతి గ్రామంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు యెండల లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మీనర్సయ్య, బిజెపి సీనియర్ నాయకులు లోక భూపతి రెడ్డి, వివిధ నియోజకవర్గ నాయకులు, వివిధ మోర్చాల జిల్లా, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.