సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

నిజామాబాద్‌, డిసెంబరు 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ వర్గాల వారి సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విట్ఠల్‌ రావు, కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి కోరారు. బుధవారం జెడ్పి ఛైర్మన్‌ విట్ఠల్‌ రావు అధ్యక్షతన జెడ్పి మీటింగ్‌ హాల్‌లో జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల వారీగా అజెండా అంశాలపై చర్చించారు.

ఆర్టీసీ సంస్థ చైర్మన్‌ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా జెడ్పి సమావేశానికి హాజరైన సందర్భంగా ఆ సంస్థ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌కు, జిల్లాలో మూడేళ్ళ పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డిని జెడ్పి చైర్మన్‌, సభ్యులు ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ మాట్లాడుతూ, జిల్లా పరిషత్‌తో తనకు విడదీయరాని అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. రెండు పర్యాయాలు ఎంపీపీగా, నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గడిచిన 30 సంవత్సరాల నుండి జిల్లా పరిషత్‌ సమావేశాలకు హాజరవుతున్నానని అన్నారు. ప్రస్తుతం ఆర్టీసీ చైర్మన్‌ హోదాలో సమావేశంలో పాల్గొనడం కొత్త అనుభూతికి లోను చేసిందన్నారు. ఆర్టీసీ చైర్మన్‌గా తన సొంత జిల్లాకు అవసరమైన కొత్త బస్సులతో పాటు బస్టాండ్‌ల మరమ్మత్తులు, ప్రహరీల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.

సిబ్బంది సహకారంతో ఆర్టీసీ సంస్థ నష్టాలను కొంతవరకు తగ్గించుకోగలిగామని, ప్రజలు కూడా ఆర్టీసీ బస్సులను ఆదరిస్తూ సంస్థ మనుగడకు తోడ్పాటును అందించాలని చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ విజ్ఞప్తి చేశారు. నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవతో ప్రభుత్వం బడ్జెట్లో 1500 కోట్ల రూపాయలను కేటాయిస్తూ ఆదుకుంటోందని ఈ సందర్భంగా సీఎంకు కృతజ్ఞతలు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 2025 నాటికి రాష్ట్రంలో కాలుష్య నియంత్రణ దిశగా 3000 వరకు ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు.

తిరుమల ప్రత్యేక దర్శనం టికెట్ల సదుపాయంతో భక్తుల సౌకర్యార్థం రాష్ట్రం నుండి సుమారు 30 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయని వివరించారు. తిరుపతి, షిరిడి, బెంగళూరు చత్తీస్గడ్‌ తదితర క్షేత్రాలకు కూడా ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నామన్నారు. నిజామాబాద్‌ జిల్లాకు త్వరలోనే 40 వరకు కొత్త బస్సులను కేటాయించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రధాన రహదారులకు ఆనుకుని స్థలాలు కలిగి ఉన్న బస్టాండ్లలో వాణిజ్య సముదాయాల నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఉన్న నిజాంబాద్‌ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌ సరిపోనందున, దాని స్థానంలో రైల్వే స్టేషన్‌ కు చేరువలో మరింత ఎక్కువ విస్తీర్ణంలో అన్ని వసతులతో కూడిన నూతన ప్రయాణ ప్రాంగణాన్ని నిర్మించేందుకు ముఖ్యమంత్రి కి ప్రతిపాదనలు అందించామని తెలిపారు. కొత్త బస్టాండ్‌ ఏర్పాటైతే ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్నారు.

కాగా, లాభదాయకమైన ఆయిల్‌ పాం పంట సాగును ప్రోత్సహించాలని, రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా యంత్రాంగాన్ని కోరారు. కోవిడ్‌ కొత్త వేరియంట్‌ వ్యాప్తి పై ఆందోళన నెలకొంటున్న నేపథ్యంలో ఆసుపత్రుల్లో ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని సంబంధిత అధికారులకు హితవు పలికారు.

కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ, వివిధ వర్గాల ప్రజలకు లబ్ది చేకూర్చేలా ప్రభుత్వం వచ్చే సంక్రాంతి పండుగ నాటి నుండి పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయనుందని అన్నారు. రైతు బంధు కింద జిల్లా రైతాంగానికి ఎకరాకు ఐదు వేల చొప్పున ఇప్పటివరకు 2122 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో వేయడం జరిగిందన్నారు. మరో 273 కోట్ల రూపాయల నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నామని కలెక్టర్‌ వివరించారు.

కాగా, జనవరి 18 నుండి జిల్లాలో 70 బృందాలతో అన్ని ఆవాస ప్రాంతాల్లో కంటి వెలుగు కార్యక్రమం కింద నేత్ర పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అవసరమైన వారికి కంటి అద్దాలు ఉచితంగా అందజేయడం జరుగుతుందని తెలిపారు. మన ఊరు – మన బడి కింద ప్రతి మండలంలో కనీసం రెండు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులన్నీ పూర్తిచేసి ప్రారంభోత్సవాలు జరిపేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

జిల్లా వ్యాప్తంగా 6800 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, ఇప్పటికే వాటిలో కొన్ని లబ్ధిదారులకు కేటాయించామని కలెక్టర్‌ వివరించారు. మిగతా రెండు పడక గదుల ఇళ్లను సంక్రాంతి సందర్భంగా అర్హులైన వారికి అందించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. దళిత బంధు మలి విడత కార్యక్రమాన్ని సైతం ప్రభుత్వం అమలు చేయనుందని సూచించారు. ఈ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అర్హులైన వారందరికీ లబ్ది చేకూరేలా చూడాలని కలెక్టర్‌ జెడ్పి సభ్యులను కోరారు. కాగా, ఎరువులు, క్రిమిసంహారక మందుల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని శాసన మండలి సభ్యులు వి.గంగాధర్‌ గౌడ్‌ జిల్లా యంత్రాంగాన్ని కోరారు.

అలాగే, అర్హులైన గౌడ కులస్తులకు టీ.ఎఫ్‌. టీ లైసెన్సులు త్వరితగతిన మంజూరయ్యేలా చూడాలన్నారు. సమావేశంలో పలువురు సభ్యులు ప్రస్తావించిన అంశాలపై కలెక్టర్‌ స్పందిస్తూ, అర్హులకు ఆసరా పెన్షన్లు అందించేలా చొరవ చూపుతామని, అభివృద్ధి పనులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత ప్రజాప్రతినిధులకు ముందుగానే తెలియజేయాల్సిందిగా అధికారులను ఆదేశిస్తామని అన్నారు. వ్యవసాయ పంట ఉత్పత్తులను ఆరబెట్టుకునేందుకు రైతులు నిర్మించుకునే కల్లాలకు కేంద్ర ప్రభుత్వమే నిధులు సమకూర్చాలని జెడ్పి చైర్మన్‌ సమావేశంలో తీర్మానాన్ని ప్రతిపాదించగా, సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.

సమావేశంలో ఐడీసీఎంఎస్‌ ఛైర్మన్‌ మోహన్‌, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్వర్‌, జెడ్పి సీఈఓ గోవింద్‌, డీఎఫ్‌ఓ వికాస్‌ మీనా, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »