నిజామాబాద్, డిసెంబరు 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువకేంద్ర ఆధ్వర్యంలో ఎయిడ్స్ ,టిబి, ఇతర లైంగిక, అంటు వ్యాధుల పట్ల యువతకు అవగాహన, శిక్షణ సదస్సును ముబారక్ నగర్‌లోని వివేకానంద ఐటిఐ కళాశాలలో నిర్వహించారు.
సభాధ్యక్షురాలు, కార్యక్రమ నిర్వాహకురాలు, జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ మాట్లాడుతూ నెహ్రూ యువ కేంద్ర ప్రతిష్టాత్మకంగా ఈ శిక్షణను అన్ని జిల్లాల్లో నిర్వహిస్తోందని, యువతీయువకులకు అందరికీ ఈ విషయాల పట్ల అవగాహన తప్పనిసరిగా ఉండాలని, కావున ఈ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అనంతరం తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నుంచి విచ్చేసిన శిక్షకులు స్వామి మాట్లాడుతూ హెచ్‌ఐవి ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన లోపమే వ్యాధి పెరగడానికి కారణమని, ఎయిడ్స్ వ్యాధి గ్రస్థులను బహిష్కరించడం అమాణుశమని అలా చేయకూడదని సూచించారు, సరైన అవగాహన, జాగ్రత్తలు పాటిస్తే ఈ వ్యాధి నుంచి మొత్తం సమాజాన్ని తప్పించవచ్చని సూచించారు. ఎయిడ్స్ అనే వ్యాధి నివారణ సాధ్యమే అని దానికి అందరి సహకారం కావాలని సూచించారు. ఎయిడ్స్ వ్యాధి దాని నివారణ మీద డిజిటల్ స్క్రీన్, ప్రొజెక్టర్ వీడియో ప్రదర్శన ద్వారా వారు అవగాహన కల్పించారు.
జిల్లా టిబి నియంత్రణ అధికారి నరేష్ మాట్లాడుతూ టిబి లక్షణాలు కలవారికి ప్రభుత్వం ఉచితంగా మందులు, వైద్య సేవ అందిస్తుందని కావున మన ఇంట్లో, చుట్టుపక్కల ఎవరైనా దగ్గు, దమ్ము, బలహీనత కలిగిన వారిని గుర్తించి వారిని చికిత్స కోసం పంపాలని కోరారు. భారతదేశం 2025 లోపు టిబి రహిత దేశంగా మారాలని మన భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంకల్పం అని తెలిపారు.
అనంతరం హెచ్‌ఐవి నియంత్రణ అధికారి సుధాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఈ తరహా వ్యాధుల నివారణకు ఎన్నో చర్యలు చేపట్టిందని, ప్రజలకు అందుబాటులో కండోమ్స్, ఇతర రక్షణ జాగ్రత్తల వివరాలతో కూడిన ప్రచారం చేస్తుందని దానిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కిషన్ రెడ్డి, నెహ్రూ యువ కేంద్ర వలంటీర్ లత, కళాశాల సిబ్బంది, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.