జిల్లా అధికారులకు కలెక్టర్‌ కీలక ఆదేశాలు

నిజామాబాద్‌, డిసెంబరు 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన ఊరు – మన బడి కార్యక్రమం కింద నిర్దేశిత బడులలో చేపట్టిన పనులన్నీ జనవరి మొదటివారం ముగిసే నాటికి తప్పనిసరిగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ మన ఊరు – మన బడి, స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీ, తెలంగాణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటు, హరిత హారం, పల్లె ప్రకృతి, బృహత్‌ పల్లె ప్రకృతి వనాలు, పారిశుధ్యం నిర్వహణ తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో ఒక్కో మండలం వారీగా ఆయా కార్యక్రమాల ప్రగతిపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.

ప్రతి మండలంలో కనీసం రెండు పాఠశాలల్లో జనవరి 8 వ తేదీ నాటికి పనులను పూర్తి చేయించి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలన్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుండి స్పష్టమైన ఆదేశాలు అందాయని, నిర్ణీత గడువులోపు పనులను పూర్తి చేయించేందుకు చొరవ చూపాలన్నారు. టాయిలెట్స్‌, కిచెన్‌ షేడ్స్‌, ప్రహరీలు, రెయిలింగ్‌, ప్లాంటేషన్‌ తో పాటు పెయింటింగ్‌ వంటివన్నీ పూర్తి కావాలని, ఏ ఒక్క పని కూడా పెండిరగ్లో ఉండకుండా గట్టిగా కృషి చేయాలని సూచించారు.

మెట్లు, ర్యాంప్‌ ఉన్న చోట తప్పనిసరిగా రెయిలింగ్‌ ఏర్పాటు చేయించాలని, అలాగే మొదటి అంతస్థు కలిగి ఉన్న బడులలో డ్రాప్‌ వాల్‌ దగ్గర కూడా రెయిలింగ్‌ ఉండాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకం కింద పూర్తయిన పనులకు వెంటనే ఎఫ్‌.టీ.ఓ లు జెనరేట్‌ చేయాలని, తద్వారా తక్షణమే బిల్లుల చెల్లింపులు జరుగుతాయన్నారు. ప్రతి పాఠశాల ఆవరణను ఎత్తుపల్లాలు లేకుండా చక్కగా చదును చేయించి, ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటించి ఆహ్లాదకర వాతావరణం నెలకొనేలా చొరవ చూపాలన్నారు.

ఆయా పాఠశాలల్లో పనికివచ్చే విధంగా ఉన్న పాత అలమారాలకు మరమ్మత్తులు జరిపించి, పెయింట్‌ వేయించాలని, మిగతా ఫర్నీచర్‌ ను తాము త్వరలోనే పంపిస్తామని కలెక్టర్‌ సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జనవరి మొదటి వారం నాటికి తప్పనిసరిగా కనీసం రెండు పాఠశాలల్లో పనులన్నీ సంపూర్ణంగా జరిగేలా చూడాలని, లేనిపక్షంలో సంబంధిత ఎంపీడీవోలు, ఏ.ఈలపై ప్రభుత్వం చర్యలు చేపట్టే అవకాశం ఉందన్నారు.

స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీలో మరింత ప్రగతి సాధించాలని కలెక్టర్‌ సూచించారు. జిల్లాలో సగటున 69 శాతం లింకేజీ రుణాల పంపిణీ జరుగగా, కొన్ని క్లస్టర్లు పూర్తిగా వెనుకబడి ఉన్నాయని అన్నారు. వచ్చే వారం నాటికి అన్ని క్లస్టర్ల పరిధిలో 90 శాతం లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. పనితీరు మెరుగుపర్చుకోని ఏపీఎం లు, సి.సి లపై క్రమశిక్షణ చర్యలు తప్పవని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల పరిధిలోనూ తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హరితహారం కింద నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని, పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్సులో జెడ్పి సీఈఓ గోవింద్‌, డీఆర్డీఓ చందర్‌, డీపీఓ జయసుధ, మెప్మా పీ.డీ రాములు, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ శ్రీనివాస్‌ రావు, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్‌, డీ.ఈ.ఓ దుర్గాప్రసాద్‌, హన్మంత్‌ రావు, డీటీడబ్ల్యుఓ నాగూరావు, ఎస్సీ కార్పొరేషన్‌ ఈ.డీ రమేష్‌, ఎన్‌.ఐ.సి జిల్లా మేనేజర్‌ కార్తిక్‌, ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు దేవిదాస్‌, భావన్న, మురళి తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »