ఎడపల్లి, డిసెంబరు 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండలంలోని ఒకటవ వార్డులో త్రాగునీటి కొరతను నిరసిస్తూ కాలనీ వాసులు రోడ్డెక్కారు. బోధన్ -నిజామాబాద్ ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో మహిళలు రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు.
గ్రామంలో ఒకటవ వార్డులోని కాలనీ వాసులకు గత కొన్ని నెలలుగా మిషన్ భగీరథ ద్వారా గానీ, నల్లాల ద్వారా గానీ త్రాగునీరు రావడంలేదని ఫలితంగా త్రాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు.
ఈ విషయమై గ్రామపంచాయతీ అధికారులకు, గ్రామ సర్పంచ్ కి పలుమార్లు విన్నవించినప్పటికీ ఇంతవరకు చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. దూరం నుంచి త్రాగు నీటిని తీసుకురావడంతో ఇబ్బందులు తప్పడం లేదని వారు ఆవేదన వ్యక్తంచేశారు. సమాచారం తెలుసుకొన్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానిక సెక్రటరీతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామి ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు.