కామారెడ్డి, డిసెంబరు 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జంగంపల్లిలో 9వ తరగతి ఇంగ్లీష్ మీడియం చదువుతున్న విద్యార్థిని ఎస్. కె సనా హిందీ భాషలో కవితలు రాయడంలో ప్రతిభ కనబరుస్తుంది. ఆమె హిందీలో ఎన్నో బాల్ గీత్‌లను, చిన్న చిన్న హిందీ కవితలను రాసింది. పాఠశాలలో నిర్వహించే బాలసభలలో హిందీలో అనేక కవితలను వినిపించింది.
ఇటీవల ఈమె రాసిన మా (అమ్మ) శీర్షికపై కవితను మేరీ కలం అనే పుస్తకంలో అచ్చు వేశారు. ఎందరో ప్రముఖులు రాసిన కవిత సంకలనంలో సనా రాసిన కవితకు పుస్తకంలో చోటు లభించింది. ఈ పుస్తకంలో రాష్ట్రంలోని ప్రముఖులు రాసిన మేటి కవితలు ఉన్నాయి. గీతా ప్రకాశన్ హైదరాబాద్, లక్నో, ఢల్లీి ద్వారా వెలువడిన ఈ గొప్ప పుస్తకంలో మా (అమ్మ) శీర్షికన సనా రాసిన కవితకు చోటు లభించడం చాలా గొప్ప విషయమని ప్రధానోపాధ్యాయులు లింబాద్రి అన్నారు.
గతంలో పదవ తరగతి విద్యార్థి విగ్నేష్ రాసిన బాల్ గీత్‌లు కూడా హిందీ అధ్యాపక్ మంచ్ ఆధ్వర్యంలో బాల్ గీత్ పుస్తకంలో ప్రచురించబడ్డాయని ప్రధానోపాధ్యాయులు లింబాద్రి అన్నారు. అదే బాటలో విద్యార్థిని సనా కూడా హిందీ కవితలను రాస్తుండడం సృజనాత్మకతలో భాగమన్నారు. ఈ సందర్భంగా సనాకు పుస్తకాన్ని అందించి ఉపాధ్యాయులు ఆమెను అభినందించారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు లింబాద్రి, విజయనిర్మల, రవి, సత్యనారాయణ, రాజ్యలక్ష్మి, ప్రవీణ, సౌందర్య, కల్పన హిందీ ఉపాధ్యాయులు గఫూర్ శిక్షక్ పాల్గొన్నారు.