నిజామాబాద్, డిసెంబరు 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హిందు దేవుళ్ళను, అయ్యప్ప స్వామిని కించపరుస్తూ, హిందువుల మనోభావాలను గాయపరిచిన బైరి నరేష్, రెంజర్ల రాజేష్, శాన్ అనే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వివిధ పోలీస్ స్టేషన్‌లలో పిర్యాదులు దాఖలయ్యాయి. నిజామాబాద్ ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్‌లో న్యాయవాది పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్ మోహన్ గౌడ్, మూడవ పోలీస్ స్టేషన్‌లో న్యాయవాది, బి.జే. పి.లీగల్ సెల్ సంయుక్త కన్వీనర్ ఉదయ కృష్ణ, నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో న్యాయవాది, బి.జే.పి రూరల్ కన్వీనర్ బిట్లా రవి వేరు వేరుగా సంబంధిత స్టేషన్ హౌజ్ అధికార్లకు పిర్యాదులు సంబంధిత సీడీలతో సహా అందజేశారు.
ఈ సందర్భంగా న్యాయవాది పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్ మోహన్ గౌడ్ మాట్లాడుతూ హిందువులు పూజించే, ఆరాధించే, విశ్వసించే దేవతలను అగౌరవపర్చడం, విమర్శించడం, అవహేళన చేయడం కోట్లాది మంది హిందువుల మనోభావాలను గాయపరచడమేనని అన్నారు. సదరు వ్యక్తులను చట్టం ముందు దోషులుగా నిలబెట్టే వరకు విశ్రమించబోమని తెలిపారు.
సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ జరిపించాలని సంబంధిత సంస్థలను తక్షణమే నిషేధించాలని డిమాండ్ చేశారు. పిర్యాదు పత్రాలు అందజేసిన వారిలో న్యాయవాదులు నరేందర్ రెడ్డి, వసంత్ రావు, సంతోష్ నాగ్ పాల్గొన్నారు.