బీమ్‌గల్, జనవరి 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలం సికింద్రపూర్ గ్రామంలో 8 కోట్ల 40 లక్షల వ్యయంతో నిర్మించిన 10వేల మెట్రిక్ టన్నుల గోడౌన్ ను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. అనంతరం అధునాతన సౌకర్యాలతో నిర్మించిన గోదాంను మంత్రి పరిశీలించారు.
ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. బాల్కొండ నియోజకవర్గంలో గతంలో ఒక్క టన్ను నిల్వ చేసుకునే గోడౌన్ కూడా లేదని, ముఖ్యమంత్రి కేసిఆర్ దయతో నేడు 25 కోట్లతో 40 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ సామర్థ్యం గల గోడౌన్లు నిర్మించుకున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌కు నియోజకవర్గ రైతుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కేసిఆర్ విప్లవాత్మక నిర్ణయాల వల్ల రాష్ట్రంలో సాగు విస్తీర్ణం,ధాన్యం ఉత్పత్తి 7 ఏళ్లలో 3 ంట్లు పెరిగిందని అన్నారు.
ముందు చూపుతో పండిన ధాన్యాన్ని నిలువ చేసుకోవడానికి లక్షల మెట్రిక్ టన్నులు గోదాంలు నిర్మించారని గుర్తు చేశారు. కేసిఆర్ తలపెట్టిన ఏ సంక్షేమ కార్యక్రమం అయినా 10 తరాల పాటు రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా రూపకల్పన చేశారన్నారు. ఇతర రాష్ట్రాల నాయకులు,రైతులు,ప్రజలు ఇది ఎలా సాధ్యం అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారనీ అన్నారు. రైతు బంధు,రైతు భీమా,24గంటల ఉచిత విద్యుత్, సాగునీటి కోసం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు,సకాలంలో ఎరువులు… ఇన్ని కార్యక్రమాల అమలుపై ఆశ్చర్య పోతున్నారుని తెలిపారు.
అందుకే యావత్ దేశం కేసిఆర్ నాయకత్వం కావాలని,తెలంగాణ తరహా అభివృద్ది కావాలని కోరుకుంటుందని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు సైతం కేసిఆర్ తెలంగాణలో చేస్తున్న అభివృద్ది మాకు కావాలని బహిరంగంగానే చెబుతున్నారన్నారు. తెలంగాణ నేడు దేశంలోనే అభివృద్ధిలో,సంక్షేమంలో నెంబర్ వన్ రాష్ట్రం అని అన్నారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో కూడా సంక్షేమ పథకాలు ఎక్కడా ఆగలేదని చెప్పారు.
ఇంత చేస్తున్న కొంత మంది మాటలు చెప్తూ ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నారని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. పని చేసేది ఎవరు..? మాటలు చెప్పేది ఎవరు అని ప్రజలు ఆలోచన చేయాలన్నారు. కేసిఆర్ తెలంగాణలో ఇస్తున్నట్లు వారి పాలిత రాష్ట్రాల్లో రైతు బంధు,రైతు భీమా,కళ్యాణ లక్ష్మి,పెన్షన్లు లాంటి సంక్షేమ పథకాలు ఇస్తున్నారా అని నిలదీశారు. దేవుని పేరుమీద రాజకీయాలు చేస్తున్నవారి అబద్ధపు ప్రచారాలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.