కామారెడ్డి, జనవరి 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే యజమానులపై కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ లోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం ఆపరేషన్ స్మైల్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
ఇటుక బట్టీలు, హోటల్లు, గృహ నిర్మాణ పనుల్లో బాల కార్మికులు పనిచేస్తే వారిని గుర్తించి ప్రభుత్వ పాఠశాలలో, వసతి గృహాల్లో చేర్పించాలని సూచించారు. పాఠశాలల్లో విద్యార్థులు మత్తు పదార్థాలు వినియోగించకుండా అవగాహన కల్పించాలని కోరారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ డివిజన్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆపరేషన్ స్మైల్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.
కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారిని స్రవంతి, జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమ అధికారిని రమ్య, జిల్లా కార్మిక సంక్షేమ అధికారి సురేందర్, సి డబ్ల్యూ సి కమిటీ సభ్యురాలు స్వర్ణలత, ఎక్సైజ్, పోలీస్, విద్యాశాఖల అధికారులు పాల్గొన్నారు.