వేల్పూర్, జనవరి 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో అవసరమైన ప్రాంతాల్లో రైల్వే ఓవర్ బ్రిడ్గ్ ల మంజూరు కోసం రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రిగా తనవంతు బాధ్యతను గుర్తెరిగి ఈ దిశగా కృషి చేశానని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం భీంగల్, వేల్పూర్ మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సందర్భంగా మంత్రి మాట్లాడారు.
నిజామాబాద్ శివారులోని మాధవనగర్ ఆర్.ఓ.బీ తో పాటు, అర్సపల్లి, సారంగపూర్, నవీపేట్, ఇందల్వాయిల వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్గ్ ల నిర్మాణాల కోసం నాలుగు పర్యాయాలు కేంద్ర మంత్రికి, రైల్వే బోర్డుకు లేఖలు రాశానని తెలిపారు. ఫలితంగా అర్సపల్లి ఆర్.ఓ.బీ మంజూరయ్యిందని, ఇది ఎంతో సంతోషాదాయకమని మంత్రి పేర్కొన్నారు. ప్రజల చిరకాల వాంఛ అయిన మాధవనగర్ ఆర్.ఓ.బి నిర్మాణానికి సైతం తాను ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసి రాష్ట్ర ప్రభుత్వం తరపున చేపట్టాల్సిన పనులకు నిధులు మంజూరు చేయించానని అన్నారు.
మాధవనగర్ ఆర్.ఓ.బీ కి మొత్తం రూ. 93 కోట్ల నిధులు అవసరముండగా, అందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.63 కోట్లు ఖర్చు చేస్తోందని, గడిచిన రెండు నెలలుగా పనులు కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం తరపున చేపట్టాల్సిన పనులు ఇంకనూ ప్రారంభం కావాల్సి ఉన్నాయని తెలిపారు. మాధవనగర్, అర్సపల్లి తరహాలోనే మిగతా మూడు ఆర్.ఓ.బీ ల మంజూరుకు సమిష్టిగా కృషి చేద్దామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జిల్లా ప్రజాప్రతినిధులకు సూచించారు.