బాల్కొండ, జనవరి 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అన్ని వర్గాల వారికి మేలు చేకూరుస్తూ, పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్రం యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. దేశమంతా ఆశ్చర్యపోయేలా తెలంగాణలో ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను నిర్విఘ్నంగా అమలు చేస్తున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఇక్కడి సంక్షేమాభివృద్ధిని చూసి ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం తెలంగాణ తరహా పాలనను కోరుకుంటున్నారని మంత్రి అన్నారు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను స్వాగతిస్తుండడం తెలంగాణలో సంక్షేమ పాలనకు అద్దం పడుతోందన్నారు.
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ సుమారు రూ. 13.50 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. భీంగల్ మండలం జగిర్యాల్ గ్రామంలో రూ. 20 లక్షలతో హెల్త్ సబ్ సెంటర్ కు, రూ. 40 లక్షలతో జాగిర్యాల్ నుండి కుప్కాల్ తండా వరకు బిటి రోడ్ పునరుద్ధరణ పనులకు, రూ. 1.50 కోట్లతో కుప్కాల్ నుండి భీంగల్ వయా గెస్ట్ హౌస్ రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేశారు.
అలాగే, రూ. 1.60 కోట్లతోకుప్కాల్ నుండి దోన్పాల్ రోడ్ పునరుద్ధరణ పనులకు, రూ. 20 లక్షలతో బెజ్జోరాలో నూతన హెల్త్ సబ్ సెంటర్ భవన నిర్మాణానికి, బెజ్జోరా నుండి లింగాపూర్ చౌట్ వరకు రూ. 1.60 కోట్లతో బిటి రోడ్ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపనలు జరిపారు. వేల్పూర్ మండలం పడగల్ నుండి పోచంపల్లి వరకు రూ. 95 లక్షలతో బిటి రోడ్ మరమ్మత్తుల పనులకు, లాక్కోరాలో రూ. 20 లక్షలతో నూతన హెల్త్ సబ్ సెంటర్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు.
అదేవిధంగా రూ. 7 కోట్లతో నూతనంగా నిర్మించిన ఎస్‌డబ్ల్యుసి (స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్) 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోడౌన్‌ను మంత్రి ప్రారంభోత్సవం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, పల్లెల సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా కోట్లాది రూపాయలతో ప్రగతి పనులను చేపడుతున్నామని అన్నారు. గురువారం ఒక్క రోజే బాల్కొండ నియోజకవర్గంలో రూ. 13.5 కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశామని తెలిపారు. ఏ గ్రామానికి ఏం చేయాలన్నది గుర్తెరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు వాస్తవాలను గమనించాలని, సంక్షేమాభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్న తమ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు. కార్యక్రమాల్లో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.