కామారెడ్డి, జనవరి 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వర్షపు నీటిని ఒడిసి పట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కేంద్ర జల శక్తి బోర్డు ఆధ్వర్యంలో కామారెడ్డి కలెక్టరేట్లో భూగర్భ జలాల సంరక్షణ, వినియోగం, యాజమాన్య పద్ధతులపై అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
కురిసిన వర్షపు నీటిని ఇంకుడు గుంతలు నిర్మించుకొని వాటిలోకి పంపి సంరక్షణ చేయాలని సూచించారు. గ్రామాల్లోని బోర్ల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకునే విధంగా అధికారులు అవగాహన కల్పించాలని కోరారు. అటవీ ప్రాంతాల్లో ఊట చెరువులు, కందకాలు, చెక్ డ్యాములు నిర్మించి భూగర్భ జలాలను పెంపొందించే విధంగా చూడాలని పేర్కొన్నారు. ఉపాధి హామీ ద్వారా పాం పాండ్స్, ఫిష్ పాండ్స్ ప్రజలు నిర్మించుకునే విధంగా అధికారులు అవగాహన కల్పించాలని కోరారు.
సౌత్ ఇండియా కేంద్ర జల శక్తి బోర్డు రీజినల్ డైరెక్టర్ డాక్టర్ జె. సిద్ధార్థ కుమార్ మాట్లాడారు. భూగర్భ జలాల సంరక్షణ, వినియోగంపై అవగాహన కల్పించారు. నీటి సంరక్షణలో యజమాన్య పద్ధతులను తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర జల శక్తి బోర్డు శాస్త్రవేత్తలు డాక్టర్ సుధీర్ కుమార్, డాక్టర్ రాణి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా కోఆర్డినేటర్ సతీష్ యాదవ్, జిల్లా వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి, వ్యవసాయ, అటవీ, ఉపాధి హామీ, నీటిపారుదల, మిషన్ భగీరథ శాఖల అధికారులు పాల్గొన్నారు.