నిజామాబాద్, జనవరి 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అనుకోని రీతిలో విపత్తులు సంభవించిన సమయాల్లో ఎన్. డీ.ఆర్.ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) నిర్వర్తించే పాత్ర ఎంతో క్రియాశీలకమైనదని అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ ప్రశంసించారు. విపత్తులు సంభవించినప్పుడు ఎన్. డీ.ఆర్.ఎఫ్ ఎలా స్పందిస్తుంది.. ఎలాంటి పాత్ర పోషిస్తుంది అనే అంశాలపై అవగాహన కల్పించేందుకు శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని క్రీడా అథారిటీ మైదానంలో మాక్ డ్రిల్ నిర్వహించారు.

విద్యార్థిని, విద్యార్థులు, ఎన్ సి సి క్యాడెట్లు, వివిధ శాఖల అధికారులు, స్థానికులు ఎంతో ఆసక్తితో మాక్ డ్రిల్ ను తిలకించారు. ప్రకృతి పరంగా లేదా మానవ తప్పిదాల వల్ల విపత్తులు సంభవించిన సందర్భాల్లో ఎన్. డీ.ఆర్.ఎఫ్ నిర్వర్తించే విధుల గురించి మాక్ డ్రిల్ ప్రదర్శన ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు. ముఖ్యంగా పేలుళ్లు సంభవించినప్పుడు, ప్రమాదకర రసాయనాలు విడుదలైన సందర్భాల్లో ఎలా వ్యవహరిస్తారు, ఎలాంటి పరికరాలు వినియోగిస్తారు, ప్రమాదాల్లో చిక్కుకున్న వారిని ఎలా కాపాడతారు అన్నది ప్రయోగాత్మకంగా ఆకట్టుకునే రీతిలో ఆచరణాత్మక విధానంలో చేసి చూపించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, విపత్తుల సమయాల్లో నష్ట నివారణ కోసం ఎన్. డీ.ఆర్.ఎఫ్ ఎంతో సాహసోపేతంగా విధులు నిర్వర్తిస్తుందని అన్నారు. విపత్తుల్లో చిక్కుకున్న వారికి భరోసాను అందిస్తోందన్నారు. గత పక్షం రోజులుగా విజయవాడ కేంద్రంగా విధులు నిర్వర్తించే ఎన్.డీ.ఆర్.ఎఫ్ బృందం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మాక్ డ్రిల్ ప్రదర్శనలు నిర్వహించి విద్యార్థులకు, ప్రజలకు విపత్తుల పట్ల అవగాహన కల్పించారని పేర్కొన్నారు.

ప్రమాదాలు, విపత్తులు జరిగినప్పుడు సాధారణ పౌరులు కూడా తమవంతు బాధ్యతగా తక్షణమే స్పందించాలని, పోలీస్, అగ్నిమాపక శాఖలకు సమాచారం అందించాలని అదనపు కలెక్టర్ హితవు పలికారు. ఎంత త్వరగా స్పందిస్తే, అంత ఎక్కువగా ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్.డీ.ఆర్.ఎఫ్ బృందం సభ్యులను జిల్లా యంత్రాంగం తరఫున అదనపు కలెక్టర్ శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలు బహూకరించారు.
కార్యక్రమంలో నిజామాబాద్ ఆర్డీఓ రవి, ఎన్.డీ.ఆర్.ఎఫ్ ఇన్స్ పెక్టర్ బిటెన్ సింగ్, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి మధుసూదన్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుదర్శనం, డీఐఈఓ రఘురాజ్, నగర పాలక సంస్థ అధికారులు అప్జల్ అలీం, సాజిద్, తహశీల్దార్లు సుదర్శన్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.