బోధన్, జనవరి 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ మండలంలోని జాడీ జమాల్పూర్ గ్రామం మీదుగా అక్రమంగా తరలిస్తున్న 500 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం పట్టుకున్నట్లు ఏసీపీ కిరణ్ కుమార్ తెలిపారు. మంగళవారం పట్టణంలోని రూరల్ సీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏసీపీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ పోలీస్ కమిషనర్ నాగరాజు ఉత్తర్వుల ప్రకారం జాడీ జమాల్ పూర్ గ్రామం మీదుగా అక్రమంగా పిడిఎస్ బియ్యం తరలిస్తున్నారని సమాచారం మేరకు సోమవారం టాస్క్ ఫోర్స్ సిఐ శ్రీధర్, రూరల్ సిఐ శ్రీనివాస్, ఎస్‌ఐ సందీప్ నేతృత్వంలో మహారాష్ట్రకు చెందిన రెండు లారీలను పట్టుకోవడం జరిగిందన్నారు.
అట్టి వాహనాలను తనిఖీ చేయగా సుమారు 16 లక్షల రూపాయల విలువగల పిడిఎస్ బియ్యం ఉన్నట్లు తెలిపారు. బియ్యాన్ని తరలిస్తున్న నిందితులు ఎండి ఖలీమ్, తుపాకర్ రాజారామ్, సహాయకుడు మహమ్మద్ ఇక్బాల్‌లను అదుపులోకి తీసుకుని, వాహనాలను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. కేసు నమోదు చేసుకుని పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా ఎవరు చేస్తున్నారో, ఎక్కడి నుండి ఎక్కడికి తరలిస్తున్నారో అనే కోణంలో దర్యాప్తు చేయడం జరుగుతుందన్నారు. సమావేశంలో పోలీస్ సిబ్బంది ఉన్నారు.