ఆర్మూర్, జనవరి 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రకృతి పరంగా సహజ సిద్ధమైన వాతావరణంలో వెలసిన ఆర్మూర్ సిద్దుల గుట్ట శ్రీ నవనాథ సిద్దేశ్వర ఆలయం ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. ఈ దిశగా సిద్దులగుట్ట ప్రాంతాన్ని సుప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రంగా, ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తామని పేర్కొన్నారు.
సిద్దుల గుట్ట వద్ద ఇప్పటికే కొనసాగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత, ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు కలెక్టర్ ను సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ప్రధాన రహదారి నుండి గుట్ట పైభాగం వరకు చేపడుతున్న ఆయా పనుల వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
నాణ్యతతో పనులు జరిగేలా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మానసిక ప్రశాంతతను అందించే విధంగా అద్భుతమైన వాతావరణం కలిగి ఉన్న ఈ ప్రదేశాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎల్లమ్మ తల్లి దేవాలయంతో పాటు శ్రీ నవనాథ సిద్దేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రధాన అర్చకులు ఆలయ విశిష్టత గురించి జిల్లా పాలనాధికారికి తెలియజేశారు. కలెక్టర్ వెంట ఆర్ అండ్ బీ ఎస్‌ఈ రాజేశ్వర్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.