హైదరాబాద్, జనవరి 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాజ్‌భవన్‌లో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిబ్బంది, అధికారులతో కలిసి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంబరాల్లో పాల్గొని పొంగలి వండి అందరికీ వడ్డించారు. ఆరోగ్య పొంగల్, సంతోష పొంగల్, జీ20 పొంగల్ అని తమిళిసై వ్యాఖ్యానించారు. పండుగ సందర్భంగా అందరూ ఆరోగ్యంగా, సుఖ:సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. తెలుగు రాష్ట్రాల మధ్య వందేభారత్ రైలు ప్రారంభం సంతోషకరమన్నారు. ప్రధాని మోదీ రైల్వే శాఖపై ప్రత్యేకంగా దృష్టి సారించారని అన్నారు.
వేడుకల అనంతరం తమిళిసై మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వ బిల్లులు నా వద్ద పెండిరగ్‌లో లేవు.. పరిశీలనలో ఉన్నాయి. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. న్యాయపరమైన చిక్కులతో నియామకాలు ఆలస్యం కారాదన్నదే నా భావన. కొత్త విధానం తీసుకొచ్చినప్పుడు ఎలాంటి లోపాలు ఉండరాదు. మలక్‌పేట్ ఆసుపత్రిలో సిజేరియన్ శస్త్రచికిత్స చేయించుకున్న ఇద్దరు మహిళలు మరణించడం బాధాకరం. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి.
ప్రతి ఆసుపత్రిలో ప్రసవ సేవలు ప్రాథమికంగా ఉండాలి. ఓ గైనకాలజిస్ట్‌గా నాకు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఆసుపత్రిని సందర్శించాలని నేను అనుకున్నాను. అయితే, పండుగ కారణంగా వెళ్లలేకపోయా. గతంలోనూ కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించుకున్న నలుగురు మహిళలు మరణించారు. ప్రాథమిక సేవలైన ప్రసవాలు, సిజేరియన్లకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండరాదు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదని నేను అనడం లేదు.. జనాభా నిష్పత్తికి అనుగుణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు మెరుగుపరచాల్సిన అవసరం ఉంది’’ అని తమిళిసై అభిప్రాయపడ్డారు.