నిజామాబాద్, జనవరి 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్ ఉన్న అర్జీలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చొరవ చూపాలని అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 21 ఫిర్యాదులు అందాయి.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, జెడ్పి సీఈఓ గోవింద్ లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, ఆర్జీలను వెంటదివెంట పరిశీలన జరుపుతూ, ప్రజావాణి సైట్‌లో వివరాలను నమోదు చేయాలని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులకు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పలు అంశాలపై సూచనలు చేశారు.
జంతు సంరక్షణ పక్షోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
కాగా, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగనున్న జంతు సంరక్షణ పక్షోత్సవాల కార్యక్రమాన్ని పురస్కరించుకుని రూపొందించిన కరపత్రాలను అదనపు కలెక్టర్ లు చంద్రశేఖర్, చిత్రామిశ్రా సోమవారం ఆవిష్కరించారు. పక్షోత్సవాల సందర్భంగా విద్యార్థులకు వ్యాస రచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ తరహా కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో, ప్రజల్లో జంతువుల సంరక్షణ పట్ల అవగాహన పెరుగుతుందని అన్నారు. రోడ్లపై సంచరించే మూగజీవాలకు తగిన ఆవాసం కల్పిస్తూ, మేతను అందించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు జగన్నాథచారి తదితరులు పాల్గొన్నారు.