కామారెడ్డి, జనవరి 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 19న ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే కంటి వెలుగు శిబిరాలకు ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ నుంచి మండల స్థాయి అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ లో కంటి వెలుగు కార్యక్రమం పై సమీక్ష నిర్వహించారు. స్పీకర్, మంత్రి, ఎమ్మెల్యేలను, మున్సిపల్ చైర్మన్ లను, ఎంపీపీలను, జెడ్పిటిసి సభ్యులను, ఎంపీటీసీ సభ్యులను, కౌన్సిలర్లను, వార్డు మెంబర్లను పిలవాలని తెలిపారు.
వార్డుల వారీగా కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజలు హాజరయ్యే విధంగా అధికారులు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. జిల్లాకు 41,130 కంటి అద్దాలు వచ్చాయని తెలిపారు. కంటి వెలుగు కార్యక్రమంలో పంచాయతీ, మున్సిపల్, వైద్యశాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. శిబిరాల వద్ద గొడవలు కాకుండా ఇద్దరు కానిస్టేబుళ్లను బందోబస్తు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
వైద్య సిబ్బందికి అవసరమైన ఏర్పాట్లను పంచాయతీ, మునిసిపల్ అధికారులు పూర్తిచేయాలని కోరారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్, ఆర్డీవోలు శ్రీనివాస్ రెడ్డి, శీను, వైద్యులు, డిఎల్పివోలు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.