ఇది అందరి కార్యక్రమం… నిర్లక్ష్యం చేస్తే వేటు తప్పదు

నిజామాబాద్‌, జనవరి 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణలో నిర్లక్ష్యానికి తావు కల్పిస్తే వేటు తప్పదని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి హెచ్చరించారు. ‘కంటి వెలుగు’ కేవలం వైద్యారోగ్య శాఖకు సంబంధించినది మాత్రమే కాదని, ఇది అందరి కార్యక్రమం అయినందున అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమిష్టి కృషితో విజయవంతం చేసి జిల్లాకు మంచి పేరు తేవాలని హితవు పలికారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్‌ కంటివెలుగు కార్యక్రమం ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కంటి వెలుగు విధులను నిర్వహించడంలో అలసత్వ వైఖరి ప్రదర్శించిన బోధన్‌ హోమియో డిస్పెన్సరీ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ హైమావతిని సస్పెండ్‌ చేయాల్సిందిగా డీ.ఎం.హెచ్‌.ఓ ను ఆదేశించారు. తప్పిదాలకు ఆస్కారం కల్పిస్తూ, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఎంతమాత్రం ఉపేక్షించబోమని కలెక్టర్‌ తేల్చి చెప్పారు. వైద్య బృందాలు సమయ పాలన పాటిస్తూ ప్రతి రోజు ఉదయం 8 . 30 గంటలకే తమకు కేటాయించిన శిబిరాల వద్దకు చేరుకోవాలని ఆదేశించారు.

గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, వీ.ఓ.ఏ లు స్థానికంగా అందుబాటులో ఉంటూ శిబిరాల నిర్వహణకు పూర్తి సహకారం అందించాలని, శిబిరం ప్రారంభం అయ్యే ఐదు రోజుల ముందు నుండి శిబిరం ముగిసేంత వరకు ఎవరు కూడా సెలవుల్లో వెళ్ళడానికి వీలు లేదని కలెక్టర్‌ స్పష్టం చేశారు. కంటి పరీక్షా శిబిరాల నిర్వహణ కోసం వచ్చే బృందాలకు ఇంటి వాతావరణాన్ని తలపించేలా నాణ్యమైన వసతి, భోజన సదుపాయాలను సమకూర్చాలని ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లకు సూచించారు.

శిబిరాల వద్ద సరిపడా టేబుళ్లు, కుర్చీలు, షామియానాలు, తాగునీటి వసతి, పారిశుధ్యం వంటి సదుపాయాలు అందుబాటులో ఉంచాలని, విద్యుత్‌ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కంటి వెలుగు శిబిరాల నిర్వహణ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ముందస్తుగానే అందుబాటులో ఉన్న అన్ని మార్గాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలన్నారు.

18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. శిబిరాల్లో ప్రతి రోజు కనీసం 120 నుండి 130 మందికి కంటి పరీక్షలు నిర్వహించేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని అన్నారు. శిబిరాల్లోనే అవసరమైన వారికి కంటి అద్దాలు, మందులు అందించాలని, క్యాటరాక్ట్‌ సర్జరీ అవసరమైన వారిని నిజామాబాద్‌ జీజీహెచ్‌ ఆసుపత్రికి రెఫర్‌ చేయాలని కలెక్టర్‌ సూచించారు. ప్రజాప్రతినిధులను ఆహ్వానించి కంటివెలుగు శిబిరాలు ఘనంగా ప్రారంభం అయ్యేలా అట్టహాసపు ఏర్పాట్లు చేయాలని అన్నారు.

ఉపాధి హామీ పనుల ఆడిట్‌ వివరాలను అప్లోడ్‌ చేయాలి

కాగా, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల ఆడిట్‌ వివరాలను సంబంధిత పోర్టల్‌ లో వెంటనే అప్లోడ్‌ చేయాలని కలెక్టర్‌ ఏ.పీ.ఓ లను ఆదేశించారు. వచ్చే మంగళవారం నాటికి అప్లోడ్‌ ప్రక్రియను పూర్తి చేయాలని గడువు విధించారు. అదేవిధంగా ఉపాధి హామీ కూలీల ప్రమాణీకరణ ప్రక్రియను కూడా తప్పిదాలు లేకుండా వేగవంతంగా చేపడుతూ, వచ్చే సోమవారం సాయంత్రం లోపు పూర్తి చేయాలని ఆదేశించారు.

ఉపాధి హామీ నిధులతో చేపట్టే సి.సి రోడ్లు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాల కోసం నిర్ణీత గడువులోపు జీ.పీలు, మండల పరిషత్‌ ల తీర్మానాలు పంపించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, జెడ్పి సీఈఓ గోవింద్‌, డీపీఓ జయసుధ, మెప్మా పీ.డీ రాములు, డీ ఎం హెచ్‌ ఓ సుదర్శనం, డాక్టర్‌ కృష్ణ, డీఆర్డీఏ ఏ.పీ.డీ సంజీవ్‌, ఆయా మండలాల అధికారులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »