నిజామాబాద్, జనవరి 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ శాఖలలో పనిచేసి రిటైర్ అయిన పెన్షనర్లకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డు పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా కమిటీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మంగళవారం సంఘ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు.
రాబోయే బడ్జెట్ సమావేశంలో ఆ మేరకు మినహాయింపు ప్రతిపాదనను పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని వారు డిమాండ్ చేశారు. కుటుంబం బ్రతకటానికి ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ పైన ఆదాయం పన్నును విధించటం అన్యాయమని వారన్నారు. అదేవిధంగా మధ్యతరగతి ఉద్యోగులకు ఆదాయపు పన్ను పరిమితిని పది లక్షలకు పెంచాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
మధ్యతరగతి ఉద్యోగులకు ఈ బడ్జెట్లో సంతోషకరమైన వార్తలు ఉంటాయని ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించిన నేపథ్యంలో పెన్షనర్లకు, మధ్యతరగతి ఉద్యోగులకు ఈ చిరు కోరికను ఆమోదించాలని వారు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు కే. రామ్మోహన్రావు, ప్రధాన కార్యదర్శి మదన్ మోహన్, నిర్వాహక కార్యదర్శి ఎస్. ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.