రెంజల్, జనవరి 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని నీలా గ్రామ శివారులో అక్రమంగా తరలిస్తున్న మొరంను గ్రామస్తులు అడ్డుకున్నారు. అక్రమార్కులు టిప్పర్లను జెసిబిలను అక్కడి నుండి తరలించే ప్రయత్నం చేశారు. గ్రామస్తులు మాత్రం అక్కడి నుండి వాహనాలను కదలనివ్వకుండా భీష్మించుకొని కూర్చున్నారు. అక్రమార్కులు చేసేది ఏమీ లేక ఊరుకున్నారు.
అక్కడికి చేరుకున్న పోలీసులు జెసిబిలు, టిప్పర్లను పంపించే ప్రయత్నం చేశారు. దీంతో గంగపుత్రులు, గ్రామస్తులు ససేమిరా అనడంతో నోరు మెదపలేకపోయారు. మైన్స్ ఏడి, తహసిల్దార్ ఇక్కడికి వచ్చేంతవరకు వాహనాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని మొండికేశారు. సుమారు నాలుగు గంటల అనంతరం ఏ డి సత్యనారాయణ, తహసిల్దార్ రాంచందర్, ఎస్సై సాయన్న సంఘటన స్థలానికి చేరుకున్నారు.
గ్రామస్తులు తహసిల్దార్ రాంచందర్ పనితీరును తప్పుపట్టారు. అక్రమ మొరం త్రవ్వకాలు జరుగుతున్న విషయాన్ని తమరి దృష్టికి తెస్తే సర్పంచులు, ఎంపీటీసీలు అడ్డుకోవాలని అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులు అడ్డుకుంటే తమరుండి ఎందుకని తహసిల్దార్‌ను నిలదీశారు. మైనింగ్ శాఖ ఏడి సత్యనారాయణ టిప్పర్లు, జెసిబిలను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాలని సూచించారు.
అధికారులు సీజ్ చేసిన ఏడు టిప్పర్లు, రెండు జెసిపిలను స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ యోగేష్, బీజేవైఎం మండల అధ్యక్షుడు ప్రకాష్, మాజీ ఎంపీటీసీ భూమన్న, అనిల్, గ్రామస్తులు ఉన్నారు.