నిజామాబాద్, జనవరి 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దృష్టి లోపాలను దూరం చేయాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు-2 కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి కోరారు. ఈ నెల 19న (గురువారం) ఉదయం 9 గంటలకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ హౌసింగ్ బోర్డు కార్యాలయం సమీపంలో గల స్త్రీ శక్తి భవన్‌లో రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి కంటి వెలుగు శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు.
శిబిరాల నిర్వహణ కోసం అవసరమైన బృందాలను, సామాగ్రిని ఇప్పటికే సమాయత్తం చేశామని అన్నారు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కంటి వెలుగు శిబిరాల్లో నేత్ర పరీక్ష నిర్వహించుకోవాలని కోరారు. శిబిరాల నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా 70 బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఒక్కో బృందం ప్రతి రోజు 120 నుండి 130 మందికి స్క్రీనింగ్ నిర్వహిస్తుందని తెలిపారు.
అవసరమైన వారికి శిబిరాల్లోనే మందులు, దూరదృష్టి లోపం ఉన్న వారికి కంటి అద్దాలు అందించడం జరుగుతుందన్నారు. ప్రిస్క్రిప్షన్ అద్దాలు అవసరం ఉన్న వారి వివరాలను ఆన్ లైన్ లో పొందుపరుస్తారని, పక్షం రోజుల్లోపు వారికి కంటి అద్దాలు ఇంటికి చేర్చేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు. దృష్టి లోపాలను దూరం చేసేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు.