కామారెడ్డి, జనవరి 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కంటి వెలుగు శిబిరాలను ప్రతిరోజు పర్యవేక్షించి శిబిరాలలో సమస్యలను గుర్తించిన వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సూచించారు. శనివారం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేత మహంతి, సంబంధిత ఉన్నత అధికారులతో కలిసి కంటి వెలుగు నిర్వహణ పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కంటి వెలుగు కార్యక్రమంపై సమీక్షించారు.
ఈ సందర్భంగా జనవరి 19, 20వ తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన కంటి వెలుగు శిబిరాల వివరాలను వైద్య శాఖ అధికారులు వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడారు. కంటి వెలుగు శిబిరాలను విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన జిల్లా కలెక్టర్‌లను, సంబంధిత అధికారులను అభినందించారు. ప్రతి వారం సోమవారం నుంచి శుక్రవారం వరకు క్యాంపులు జరుగుతాయని, శని, ఆదివారాలు క్యాంపులు ఉండవని సీఎస్ తెలిపారు.
ప్రతి రోజూ ఉదయం 9-15 లోపు కంటి వెలుగు క్యాంపుల సమాచారం అప్ డేట్ చేయాలని సీఎస్ సూచించారు. జిల్లాలో ఉన్న క్వాలిటీ కంట్రోల్ బృందాలు విస్తృతంగా కంటి వెలుగు క్యాంపులో పర్యటించాలని, జిల్లా కలెక్టర్ లు సదరు బృందాల ఫీడ్ బ్యాక్ తీసుకుని మరింత మెరుగ్గా కంటి వెలుగు శిబిరాల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు.
రాష్ట్రంలో నిర్వహించిన 2 రోజులు క్యాంపులో 11 జిల్లాల పరిధిలో 53 శాతం పైగా కళ్ళద్దాల పంపిణీ,ఆర్డర్ అవసరం అయ్యాయని సీఎస్ తెలిపారు. జిల్లాలో ఉన్న బఫర్ బృందాలను ఉపయోగిస్తూ, జర్నలిస్టులకు, ఉద్యోగులకు, పోలీసులకు, కోర్టు సిబ్బంది, వివిధ వర్గాల వారికి ప్రత్యేక కంటి వెలుగు క్యాంపులను నిర్వహించాలని అన్నారు. జిల్లాలో రాబోయే 15 రోజులలో బఫర్ బృందాల ద్వారా ప్రత్యేక వర్గాల కోసం క్యాంపులు ఏర్పాటు కావాలని, దీనికి అవసరమైన షెడ్యూల్ తయారు చేసుకోవాలని సూచించారు.
జిల్లాలో కంటి వెలుగు క్యాంపు నిర్వహణ సమయంలో పక్కాగా ట్యాబ్ ఎంట్రీ వివరాలు నమోదు కావాలని, ప్రతి రోజూ ట్యాబ్ ఎంట్రీ పర్యవేక్షించాలని సీఎస్ సూచించారు. జిల్లాలో క్వాలిటీ కంట్రోల్ బృందాల ద్వారా ప్రతి రోజూ ఫీడ్ బ్యాక్ తీసుకొని చిన్న, చిన్న లోటుపాట్లను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలో ఉన్న రీడిరగ్ కళ్ళద్దాల స్టాక్ ను కలెక్టర్ లు ప్రతి రోజూ పర్యవేక్షించాలని, అవసరమైన కళ్ళద్దాల స్టాక్ వివరాలు పాయింట్ల వారిగా ముందుగా సమాచారం అందిస్తే జిల్లాలకు సకాలంలో సరఫరా చేస్తామని అన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సంబంధిత అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో 3 రోజుల్లో 10498 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 2020 మందికి రీడిరగ్ కళ్లద్దాలను అందించామని అన్నారు. జిల్లాలో ఎక్కడ కూడా డాటా ఎంట్రీ లో సమస్యలు ఉత్పన్నం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. క్యాంపు నిర్వహించే కేంద్రాలలో జనాభా ఆధారంగా కనీసం 60 శాతం రీడిరగ్ కళ్లద్దాలను అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ తెలిపారు.
పంచాయతీ సెక్రెటరీ, సర్పంచులు కంటి వెలుగు కార్యక్రమం పై ప్రజలకు అవగాహన కల్పించేలా చూడాలని పేర్కొన్నారు. ప్రతిరోజు కచ్చితంగా ఉదయం 9 గంటలకు కంటి వెలుగు శిబిరాలు ప్రారంభం కావాలని సూచించారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ లక్ష్మణ్ సింగ్, కంటి వెలుగు ఇన్చార్జులు పాల్గొన్నారు.