నిజామాబాద్, జనవరి 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : న్యాయవ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యం పెరగడం మహిళల సాధికారతలో మరో మైలురాయిగా స్థిరపడుతుందని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి పి.శ్రీసుధ తెలిపారు. హైకోర్టు, సుప్రీంకోర్టులలో మహిళ న్యాయమూర్తుల సంఖ్య పెరుగుదల జెండర్ వివక్షకు విరుగుడుగా అభివర్ణించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పొలీస్ పేరెడ్ గ్రౌండ్లో నిర్వహించిన మహిళ సాధికారత సదస్సులో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని ప్రధానోపన్యాసం చేశారు.
స్త్రీ పురుష సమానత్వ సాధనే అందరి ఆశయం కావాలని, రాజ్యాంగ కల్పించిన ప్రతి హక్కును సాదించుకుని దేశ ప్రగతి నిర్మాణానికి సారథులు కావాలని పిలుపునిచ్చారు. వివిధ రంగాలలో మహిళలు సాధించిన విజయాలు ప్రేరణగా తీసుకుని ప్రస్తుత విద్యా, ఆర్థిక,సామాజిక, ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆమె ఉద్భోదించారు. భారత యువత దేశానికి ఉన్న అతిపెద్ద మానవ వనరులు అని, అభివృద్ధికాముక దేశానికి ఇంకేమి కావాలని అన్నారు.
కలలు కనడమే కాదు వాటిని సద్వినియోగం చేసుకోవడానికి సంకల్పబలం కలిగి వుండాలని పేర్కొన్నారు. మహిళలు శక్తి వంతులని నేడు ఎన్నో రంగాలలో ఉన్నతస్థాయికి చేరుకుని తమ ప్రతిభాపాటవాలు సమాజానికి తెలియజేస్తున్నారని తెలిపారు. ప్రజా సమూహాల నుండి కలిగిన ప్రయోజనాలను తిరిగి వారికి చేరవేయడంలో ముందుండాలని కోరారు. పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని,మంచి అలవాట్లు మంచి నడవడికను నేర్పుతాయని, సమయాన్ని వృధా చేయరాదని సమయ తిరిగిరాదని సమయానుకూల నిర్ణయాలే వ్యవస్థలో నిర్ణయాత్మక వృత్తి నిపుణులను తయారు చేస్తాయని జస్టిస్ శ్రీసుధ పలువురు ప్రముఖ వ్యక్తుల, రాజ్యాల అధినేతల నేపధ్యాలను ఉదహరించారు.
చట్ట పరమైన హక్కులను కోరతారు కాని బాధ్యతలను మరుస్తారని అమె అవేదన వ్యక్తం చేశారు. యువత జీవితాలలో అన్ని విజయాలు సమకూరాలని జస్టిస్ శ్రీసుధ ఆకాంక్షించారు. నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల ప్రసంగిస్తూ ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు ఎలాంటివి ప్రస్తుత ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలో యువత విద్యకు తగిన ఉద్యోగాన్ని బేరీజు వేసుకోవాలని సూచించారు. క్రమబద్ధమైన ప్రణాళికలు,కష్టపడేతత్వం, నిరంతర అధ్యయనం మంచి భవిష్యత్తుకు పునాదులుగా నిలుస్తాయని వివరించారు.
కామారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎన్. శ్రీదేవి మాట్లాడుతు కమ్యూనికేషన్ స్కీల్ పెంపొందించుకోవాలని,సంతృప్తికరమైన వృత్తి జీవనంలో స్థిరపడాలని అన్నారు. ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని అందుకు శ్రమైక జీవనవిధానాన్ని అలవర్చుకోవాలని అన్నారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ప్రసంగిస్తు రాష్ట్ర ప్రభుత్వం వెలువరించిన ఉద్యోగాల నోటిఫికేషన్లను వడిసిబట్టుకుని విజయులు కావాలని సదస్సుకు హాజరైన విద్యార్థినులకు ఉద్భోదించారు.
ఉద్యోగాలకోసం కసిగా కష్టపడాలని ,రాజీ పడరాదని,ఆత్మవిశ్వాసమే ఆయుధంగా పయనించాలని లక్ష్యం చేరేవరకు విశ్రమించరాదని తెలిపారు.వేదిక మీద ఉన్న మహిళలనే స్ఫూర్తిగా తీసుకోవాలని, స్త్రీలు వృత్తి నిపుణులు అని కొనియాడారు. సెల్ ఫోన్ అష్టదరిద్రమని సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని పరిమిత స్థాయిలో వినియోగించుకోవాలని కోరారు. జిల్లా న్యాయసేవ అధికార సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలు జిల్లా అధికార యంత్రాంగానికి మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయని అందులో భాగస్వామ్యం కావడం అదృష్టంగానే భావిస్తున్నామని అన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమ రాజ్ ప్రసంగిస్తూ మెడికల్ ఫీల్డ్ అనేది పుట్టుక నుండి చనిపోయే వరకు అవసమయ్యే విలువైన వృత్తిగా అభివర్ణించారు. కోవిడ్ కష్ట కాలంలో జిల్లా ఆసుపత్రిలోని వైద్యులు చేసిన వైద్య సేవలు తెలుగు రాష్ట్ర లలో ప్రథమంగా నిలిచాయని ఏ వృత్తిని ఎన్నుకున్న ఆ వృత్తిలో ప్రావీణ్యత అలవర్చుకోవాలని పేర్కొన్నారు. ఆర్.టి.సి రీజినల్ మేనేజర్ ఉషారాణి,విద్యుత్ శాఖ అధికారిణి సుమిత మాట్లాడుతూ ఆయారంగాలలో ఉన్న అవకాశాలను అందుకోవాలని అన్నారు.
సదస్సులోఅదనపు జిల్లా జడ్జిలు షౌకథ్ జహన్ సిద్ధికి, శ్రీనివాసరావు, పంచాక్షరీ, సీనియర్ సివిల్ జడ్జి శ్రీకాంత్ బాబు,జూనియర్ సివిల్ జడ్జిలు భవ్య ,సౌందర్య, గిరిజ,అదనపు పోలీస్ కమిషనర్ అరవింద్ బాబు,అదనపు జిల్లా కలెక్టర్‌లు చంద్రశేఖర్, చిత్ర మిశ్రా, నెహ్రు యువ కేంద్రం శైలి, నిశిత డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ స్వప్న, గ్రంధాలయ కార్యదర్శి లక్ష్మి రాజ్యం, ఆబ్కారీ శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ మమత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రం గణపతి, విద్యార్థినులు పాల్గొన్నారు.