ఎడపల్లి, జనవరి 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతీ ఒకరికి ఆదర్శంగా నిలుస్తున్నాయని హిందూ సంస్కృతి పట్ల ప్రపంచవ్యాప్తంగా చర్చించుకొంటున్నారని, ప్రపంచంలోని పెద్ద పెద్ద మేధావులందరూ హిందూ సంస్కృతిపై అవగాహన పెంచుకుంటున్నారని హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి అన్నారు.
ఆదివారం ఎడపల్లి మండలంలోని మంగల్పహాడ్ గ్రామంలో దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి విచ్చేసారు. ఈ సందర్భంగా హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి మాట్లాడుతూ… హిందూ సంస్కృతిలో ప్రతి మాటకు ఒక అర్థం ఉందని అన్నారు. హిందువులు చేసే ఉపవాసాలపై యూరప్ దేశాల శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారని అన్నారు. ఉపనిషత్తులు, శ్లోకాలపై కూడా పరిశోధనలు చేసి వాటి విశిష్టతను తెలుసుకుంటున్నారని అన్నారు.
ప్రతి మంత్రం ఒక శక్తివంతమని అందరు గుర్తిస్తున్నారని అన్నారు. హిందూ సంస్కృతి పై పాశ్చాత్య దేశాలు తెలుసుకుంటున్న సందర్భంలో మనదేశంలో మతమార్పిడులు జరుగుతున్నాయని ఆవేదన చెందారు. సనాతన ధర్మాన్ని ఆచరించి హిందూ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించే ప్రతి ఒక్కరిని సమాజంలో గుర్తించాలని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తోందని అన్నారు.
అనంతరం నందిపేట కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగి రాములు మహారాజ్ మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. సేవా భావం అలవర్చుకొని నిరుపేదల ఆకలి తీర్చాలని అన్నారు. దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపనకు మంగల్పాహాడు గ్రామస్తులు అందరూ ఏకతాటి పై నిలవడం అభినందనీయం అని అన్నారు. మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షులు బిల్లా రామ్మోహన్ శారద దంపతులు పాదుక పూజను నిర్వహించారు.
జడ్పీ వైస్ చైర్మన్ రజిత యాదవ్, మాజీ జడ్పిటిసి సరోజినమ్మ, మంగల్పాహాడ్ ఎంపీటీసీ వనజ నాగరాజు, ఎల్లయ్య యాదవ్, సంతోష్ గౌడ్, పురుషోత్తం, ఠాణాకలాన్ సర్పంచ్ భాస్కర్ రెడ్డి, లింగం, అబ్బయ్య, గంగారాం సాయిలు తదితరులు ఉన్నారు.