కామారెడ్డి, జనవరి 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఉత్తమ అధికారులను ఎంపిక చేసి శాఖల వారీగా వారి పేర్లను పర్యవేక్షకుడు సాయి భుజంగరావుకు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం గణతంత్ర దినోత్సవ వేడుకలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
ప్రజా ప్రతినిధులకు ఆహ్వాన పత్రికలు అందే విధంగా అధికారులు చూడాలని తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి విద్యాశాఖ, ఐసిడిఎస్, సంక్షేమ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పారు. అన్ని శాఖల అధికారులు చేపట్టిన ప్రగతి పనుల వివరాలను సీఈవో కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అడిషనల్ ఎస్పీ అన్యోన్య, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఏవో రవీందర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.