వేల్పూర్, జనవరి 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం అక్లూర్ గ్రామంలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన శిబిరాన్ని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సోమవారం సందర్శించారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన,కంటి పరీక్షలు జరుగుతున్న తీరు, ఎంత మందికి పరీక్షలు చేశారు.ఎంత మందికి అద్దాలు ఇచ్చారు. ఎంత మందికి ఆపరేషన్ అవసరం ఉంది అని కంటి వెలుగు శిబిరంలో డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
అక్కడే కంటి పరీక్షల కోసం వచ్చిన వృద్ద మహిళలను ఆప్యాయంగా పలకరించారు. అవ్వ బాగా చూస్తున్నారా.. అద్దాలు ఇస్తున్నారా అని ఆరా తీశారు. మంచిగ చూస్తున్నరు బిడ్డా.. కండ్ల అద్దాలు కూడా ఇస్తున్నారు అని మంత్రితో సంబురంగా తెలిపారు.
కేసిఆర్, మంత్రి చల్లగా ఉండాలని ఆశీర్వదించారు. అనంతరం మంత్రి వేముల మాట్లాడుతూ… కంటి వెలుగు కార్యక్రమం ఎంతో అద్భుతమని, ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని అన్నారు. కంటి పరీక్షలు చేసుకున్న అవ్వలు ఎంతో సంబురంగా చెప్తున్నారని అన్నారు. వారి ముఖాల్లో ఆనందం నింపిన కేసిఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన ప్రజలకు ఏది అవసరమో తెలిసిన గొప్ప దార్శనిక పాలకుడు ముఖ్యమంత్రి కేసిఆర్ అని మంత్రి వేముల కొనియాడారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు ఉన్నారు.