బాన్సువాడ, జనవరి 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బంజరులను ఆధ్యాత్మికత వైపు మంచి మార్గంలో నడిచే విధంగా కృషి చేసిన ఘనత రామారావు మహారాజ్ కి దక్కుతుందని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం నసురుల్లాబాద్ మండలంలోని అంకోల్ తండాలో బంజారా గురువు రామారావు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సభాపతి పోచారం మాట్లాడుతూ బంజారా జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన గురువు రామారావు మహారాజు యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్న తండావాసులకు అభినందనలు తెలిపారు. మంచి మార్గాన్ని సూచించిన వారే దేవుళ్ళని జీవితాల్లో వెలుగులు ప్రసాదించడంతో తండాలు ఆధ్యాత్మికత వైపు నడవడం ఎంతో సంతోషదాయకమన్నారు. తండాల్లో వ్యసనాలకు దూరంగా ఉండాలని బోధించి వారిని నడిపించడంలో రామారావు మహారాజ్ చేసిన కృషితో గిరిజన కుటుంబాలు ఆర్థికంగా బాగుపడ్డాయని ఆయన అన్నారు.
నసురుల్లాబాద్ మండల కేంద్రంలో ఐదు కోట్లతో గిరిజన బాలుర వసతి గృహాన్ని ఏర్పాటు చేయడంతో సుమారు 700 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని భవనం సరిపోకపోవడంతో ఏడు కోట్లతో మరో నూతన భవనాన్ని నిర్మించబోతున్నామని, మండలంలో గిరిజన బాలికల కోసం అన్మాజిపేట్ కోనాపూర్ వద్ద నూతనంగా రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు.
గిరిజన యువతి యువకుల కోసం గిరిజన ట్రైనింగ్ సెంటర్ ను నసురుల్లాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగిందని, యువకులు రామారావు మహారాజ్ బోధలను ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు భాధ్య నాయక్, ఎంపీపీ పాల్త్య విట్టల్, అంబర్ సింగ్, అర్చకులు వెంకటరమణ, అంకోల్ తాండ సర్పంచ్ రాము, తాండ పెద్దలు, గిరిజన మహిళలు తదితరులు పాల్గొన్నారు.